Euclid telescope: విశ్వ రహస్యాలపై యూక్లిడ్‌ కన్ను

Euclid telescope: విశ్వ రహస్యాలపై యూక్లిడ్‌ కన్ను
విశ్వ రహస్యాలను ఛేదించేందుకు మరో ప్రయోగం... నింగిలోకి దూసుకెళ్లిన యూక్లిడ్‌... డార్క్‌ ఎనర్జీ గుట్టు కనిపెట్టనున్న టెలిస్కోప్‌,....

విశ్వంలో అంతుచిక్కని రహస్యాలను ఛేదించే క్రమంలో మరో గొప్ప ముందడుగు పడింది. సైన్స్‌కు అంతుబట్టని విషయాలకు ఒకరూపు ఇచ్చేందుకు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఓ టెలిస్కోన్‌ను విశ్వంలోకి పంపింది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ’కి చెందిన బాన్ వాయేజ్ యూక్లిడ్‌ టెలిస్కోపు చీకట్లను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో ఈ టెలిస్కోపును ప్రయోగించారు. ఇది దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీనికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత రెండు నెలల్లో అసలైన పని ప్రారంభమవుతుంది. ఆరేళ్లపాటు యూక్లిడ్‌ టెలిస్కోప్‌ ఈ మిషన్‌లో పాల్గొంటుంది. ప్రయోగం విజయవంతమైందని జర్మనీలోని ఫ్లైట్‌ కంట్రోలర్లు ప్రకటించారు.


వందల కోట్ల పాలపుంతల్ని యూక్లిడ్‌ టెలిస్కోపు జల్లెడ పడుతుంది. 10 కోట్ల కాంతి సంవత్సరాల దూరాన ఉన్న పాలపుంతల కచ్చితమైన ప్రదేశాన్ని, వాటి ఆకృతిని పక్కాగా గుర్తిస్తుంది. విశ్వం ఆవిర్భావం నుంచి కృష్ణబిలాల వరకు అనేక అంశాలపై స్పష్టత వచ్చేందుకు ఈ టెలిస్కోపు సేవలు కీలకంగా నిలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోట్ల గెలాక్సీలను పరిశీలించడం ద్వారా విశ్వానికి సంబంధించిన అత్యంత ఖచ్చితమైన 3D మ్యాప్‌ను రూపొందించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది. ఈ సమగ్ర మ్యాప్ ఎన్నో ప్రశ్నలకు ఒక పరిష్కారం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డార్క్ ఎనర్జీ రహస్యాలకు కూడా సమాధానం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. విశ్వంలో మనకు తెలిసింది 5 శాతమేనని, మిగిలింది ఇప్పటికీ రహస్యంగానే ఉందని ఐరోపా అంతరిక్ష సంస్థ తెలిపింది.


యూక్లిడ్ టెలిస్కోపు 4.5 మీటర్ల పొడవు, 3.1 మీటర్ల వెడల్పు, 2160 కిలోల బరువు ఉంటుంది. మైనస్‌ 120 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా పనిచేసేలా ఈ టెలిస్కోపులో ఏర్పాట్లు చేసారు. ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, ఫోటోమీటర్ అయితే మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కూడా పనిచేస్తాయి. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ టెలిస్కోప్‌ కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉన్న ప్రదేశం. కాంతి కూడా బయటకు వెళ్లదు. ఇక్కడ పదార్థం భారీగా కుదించబడి ఉంటుంది. మన గెలాక్సీలో లక్షలాది కాస్మిక్ బాడీలు ఉన్నాయని సైంటిస్టులు లెక్కించారు. కానీ వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఈ రహస్యాలను చేధించేందుకు ఈ ప్రయోగం కీలకంగా మారనుంది. నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ గతంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ ద్వారా భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న రహస్యాలను కనుకొన్నే ప్రయత్నం చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story