Amazon Forest: వందకుపైగా డాల్ఫిన్లు మృతి..కారణమేంటంటే...

Amazon Forest: వందకుపైగా డాల్ఫిన్లు మృతి..కారణమేంటంటే...
అమెజాన్ అడవుల్లో రికార్డుస్థాయి టెంపరేచర్

అమెజాన్....ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతం, పచ్చని ప్రకృతికి, వింతైన జీవులకు ఆలవాలం. సమస్త జీవరాశికి జీవనాడి ఇదే. దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలకు విస్తరించిన అడవులు ఇవి. ఈ భూమండలానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తుంటారు దీన్ని. లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన చిత్తడి నేల గల ప్రదేశం ఇదే. అత్యధికంగా బ్రెజిల్‌లో 60 శాతం మేర అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. పెరు- 13, కొలంబియా-10 శాతం మేర విస్తరించాయి. బొలీవియా, ఈక్వెడార్, ఫ్రెంచ్ గయానా, గయానా, సురినమె, వెనిజులాలోనూ అమెజాన్ అడవుల జాడలు ఉన్నాయి.


ఎన్నో అరుదైన అద్భుతమైన జీవులు నివసించే అమెజాన్ అడవుల్లో ఏడాది పొడవునా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు. సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుంది. అలాంటి అమెజాన్ అడవుల్లో ఉష్ణోగ్రత ఇప్పుడు రికార్డుస్థాయికి చేరుకుంది. కొద్దిరోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల పైమాటే. అంటే 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా అక్కడి టెంపరేచర్ ఉంటోంది. ఇదే అనేక జీవజాలానికి మరణశాసనంలా మారింది. ప్రత్యేకించి- డాల్ఫిన్లు. డాల్ఫిన్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో వందకు పైగా డాల్ఫిన్లు మరణించాయి. అప్పర్ అమెజాన్‌ నదీ తీరంలో ఉన్న లేక్ టెఫెలో డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి.

అమెజాన్‌ నదీ తీరంలో ఉన్న లేక్ టెఫెలో డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించిన బ్రెజిల్ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా మమిరువా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.100కు పైగా డాల్ఫిన్ల మరణానికి వాతావరణ మార్పులే కారణమని ఈ బృందం నిర్ధారించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం అటు కరవుకు దారి తీసే ప్రమాదం ఉందని అంచనా వేసింది.


దీంతో మిగిలిన డాల్ఫిన్లను సంరక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది బ్రెజిల్ ప్రభుత్వం. వర్షంపాత్రం తక్కువ కావటం వల్ల అమెజాన్ నదీ తీరం చాలావరకు ఎండిపోయిందని సైంటిస్టుల బృందం ధృవీకరించింది. దీంతో ఆ ప్రాంతాల్లోని కొన్ని అరుదైన మొక్కలు సైతం ఎండిపోతున్నాయని పేర్కొంది. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల బ్రెజిల్‌లోని అమెజాన్ లోని ప్రాంతాల్లో కరవు ఛాయలు కనిపిస్తున్నాయి.

Tags

Next Story