Brazil Rains : బ్రెజిల్‌లో వర్ష బీభత్సం..కొండచరియలు విరిగిపడి 37మంది మృతి
బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 37కి పెరిగింది.. ఇంకా 74 మంది అదృశ్యమయ్యారు. ఇది చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తుగా అధికారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ భారీ వర్షాలు, కొండచరియల విధ్వంసకర ప్రభావాలతో పోరాడుతోంది.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తును ఎదుర్కొంటున్నామని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ విచారం వ్యక్తం చేశారు.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గురువారం రాష్ట్రాన్ని సందర్శించి స్థానిక అధికారులతో సమావేశమై తన సంఘీభావం తెలిపారు. ఈ వర్షం వల్ల నష్టపోయిన ప్రజల అవసరాలను తీర్చేందుకు మా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆయన రాశారు. వర్షం కారణంగా 10,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. సోమవారం ప్రారంభమైన వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.
ఫెడరల్ దళాలు సహాయ కార్యక్రమాల్లో మునిగాయి. 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లను రంగంలోకి దించారు. సుమారు 700 మంది సైనికులు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. మట్టిచరియల వల్ల అనేక ప్రాంతాలు మట్టిదిబ్బలుగా మారాయి. చాలా ప్రదేశాల్లో వాహనాలన్నీ ఆ మట్టిలో మునిగిపోయాయి. ఇండ్లు కోల్పోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు అందిస్తున్నారు. స్థానిక గుయిబా నది ఉప్పొంగుతోంది. డేంజర్ లెవల్స్ దాటి నీరు ప్రవహిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com