BRICS summit 2023: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు కొత్త దేశాలు

బ్రిక్స్ కూటమి విస్తరణ అంతర్జాతీయ సంస్థలకు సందేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భద్రతా మండలిసహా అంతర్జాతీయసంస్థల్లో సంస్కరణలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని కేవలం ఒక దేశానికి పరిమితం చేయరాదని, యావత్ మానవజాతి సాధించిన ఘనత అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరోవైపు బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాసేపు మాట్లాడుకున్నారు.
భద్రతా మండలి సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి బ్రిక్స్ సదస్సు వేదిక నుంచి గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అమలును బ్రిక్స్‌దేశాల కూటమి విస్తరణ, ఆధునీకరణ గుర్తుచేస్తోందన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల 3రోజుల సదస్సు ముగింపు సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ బ్రిక్స్ కూటమిలో 6దేశాలను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త సభ్యదేశాల చేరికతో కూటమికి నూతన శక్తి, దిశా లభిస్తుందన్నారు. కొత్త సభ్యదేశాలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి బ్రిక్స్‌లో భాగస్వాములవుతాయని చెప్పారు. నూతన సభ్య దేశాలతో కలిసి పనిచేయటం ద్వారా బిక్స్ కూటమికి నవ చైతన్యం అందించగలమనే విశ్వాసాన్ని ప్రధానిమోదీ వ్యక్తం చేశారు.అలాగే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావటంపై అభినందన సందేశాలు పంపిన ప్రపంచదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్-3 విజయాన్ని కేవలం ఒక దేశానికి పరిమితం చేయకూడదని, మొత్తం మానవ జాతి సాధించిన ఘనతగా చూడాలని ప్రధాని మోదీ కోరారు. యావత్ ప్రపంచమంతా గర్వపడాల్సిన విషయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కాసేపు ముచ్చటించుకున్నారు. సదస్సు ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశానికి ముందు ఇరుదేశాల అధినేతలు కాసేపు మాట్లాడుకున్నారు. దక్షిణాఫ్రికా మీడియా ఈ వీడియోను ప్రసారం చేసింది. అయితే వారిద్దరి సంభాషణపై ఇరుదేశాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బ్రిక్స్ సదస్సుకు ముందు మోదీ-జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇండోనేషియాలోని బాలిలో నవంబర్‌లో జరిగిన జీ-20 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్....విందు సందర్భంగా కాసేపు మాట్లాడుకున్నారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com