Gujarat: పెళ్లికి గంట ముందు, కాబోయే భర్త చేతిలో వధువు హత్య..

గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే భార్యను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లి చీర, డబ్బు విషయమై చెలరేగిన చిన్నపాటి గొడవ ఈ ఘోరానికి దారితీసింది. భావ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్‌కు చెందిన సాజన్ బరయ్య , సోని రాథోడ్ గత ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. బంధువులు, అతిథులు కూడా చేరుకున్నారు. అయితే, పెళ్లికి గంట ముందు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరి మధ్య పెళ్లి చీర, ఖర్చుల గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాజన్, ఇంట్లోని ఇనుప రాడ్‌తో సోనిపై దాడి చేశాడు. ఆమె చేతులు, కాళ్లపై కొట్టి, అనంతరం తలను గోడకు బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు సాజన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ పటేల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

