Britain MP Murder: ఎంపీ దారుణ హత్య.. కత్తులతో పొడిచి..

David Amess (tv5news.in)
Britain MP Murder: బ్రిటన్ ఎంపీ దారుణహత్యకు గురయ్యారు. ఎసెక్స్‌లోని సౌత్ ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్ అమీస్.. లీ- ఆన్- సీలోని ఓ చర్చిలో పౌరులతో వీకెండ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసి, కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన డేవిడ్ అమీస్.. 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. జంతు సమస్యలతో పాటు మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయనకు స్థానికంగా గుర్తింపు ఉంది. డేవిడ్ మృతి పట్ల తోటి ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఈ ఘటనను భయంకరం.. తీవ్ర దిగ్భ్రాంతికరంగా అభివర్ణించారు. గతంలోనూ పలువురు బ్రిటీష్ ఎంపీలపై దాడులు జరిగాయి. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్‌ను కాల్చి చంపారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ కత్తిపోట్లకు గురయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com