Rishi Sunak : కింగ్ చార్లెస్ కన్నా సునాక్ దంపతుల సంపాదనే ఎక్కువ .. ‘సండే టైమ్స్' తాజా నివేదిక ..

భారత సంతతికి చెందిన ఇతను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని కావడమే చాలా గ్రేట్. అలాంటిది బ్రిటన్ రాజు కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు రికార్డులకు ఎక్కారు. ఏడాదిలో రిషి సునాక్, అతని భార్య అక్షితామూర్తి ఆస్తి దాదాపు 120మిలియన్ పౌండ్లు పెరిగిందని సండే టైమ్స్ ప్రకటించింది.
బ్రిటన్‌లోని తొలి వెయ్యి మంది సంపన్నులు, వారి సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్ లేటెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇందులో కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. సునాక్ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్ పౌండ్ల నుంచి 651 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. అయితే బ్రిటన్ రాజు కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని సండే టైమ్స్ తెలిపింది. అతనికి ఎన్నో ఎస్టేట్లు, ప్యాలెస్‌లు ఉన్నాయని.. వాటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉంటుందని అంచనా.
2022-23లో రిషి సునాక్ దాదాపు రూ.23 కోట్లు సంపాదించగా, ఆయన భార్య అక్షతామూర్తి డివిడెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు సంపాదించారు. అయితే.. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా మూర్తికి షేర్లు ఉన్నాయి. అవే వీరింత సంపన్నులు కావడానికి కారణం. సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో ఈ దంపతులు గతేడాది 275వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 6వేల 873 కోట్లతో 245వ స్థానానికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ లో సంపన్నుల జాబితాలో చోటు సాధించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
టాప్ టెన్‌లో ఎవరంటే?
2024 సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో టాప్ 10లో భారత్‌లో జన్మించిన డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు కూడా స్థానం సంపాదించారు. గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న వీరు, ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకారు. వీరి సంపద సుమారు 24.977 బిలియన్ పౌండ్లుగా అంచనా వేశారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ వర్క్స్ అధిపతి లక్ష్మీ ఎన్. మిత్తల్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. గత ఏడాది ఆరో స్థానంలో ఉన్న మిత్తల్, ఈసారి ఎనిమిదో స్థానానికి పడిపోయారు. వేదాంత రిసోర్సెస్ అధిపతి అనిల్ అగర్వాల్ 7 బిలియన్ పౌండ్ల సంపదతో 23వ స్థానంలో ఉన్నారు.
2024 జాబితాలోని భారతీయ సంతతికి చెందిన బిలియనీర్‌లలో టెక్స్‌టైల్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ లోహియా 6.23 బిలియన్లతో 30వ స్థానంలో ఉన్నారు. వంద మంది సంపన్న బ్రిటిషర్లలో సైమన్, బాబీ, రాబిన్ అరోరా సోదరులు 2.682 బిలియన్ పౌండ్ల సంపదతో 65వ స్థానంలో ఉన్నారు. ఫ్యాషన్ పారిశ్రామికవేత్త సుందర్ జెనోమల్ 2.214 బిలియన్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com