Thailand: తెరుచుకోని పారాచూట్‌.. స్కైడైవర్‌ మృతి

Thailand: తెరుచుకోని పారాచూట్‌.. స్కైడైవర్‌ మృతి
భారీ అపార్ట్‌మెంట్‌‌ 29వ అంతస్తు నుంచి దూకిన బ్రిటీష్ స్కైడైవర్

అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్తు నుంచి దూకి బేస్ జంపింగ్ చేయాలనుకున్న ఓ బ్రిటీష్ స్కైడైవర్ దుర్మరణం చెందాడు. పారాచూట్ సమయానికి తెరుచుకోక పోవడంతో నేలపై పడి మృతిచెందాడు. థాయ్‌లాండ్‌లో పట్టాయ ప్రాంతంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది.

స్కైడైవింగ్‌.. జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసోపేత అనుభవాన్ని పొందాలనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. ఆకాశంలో నుంచి దూకడం చాలా మందికి థ్రిల్‌ను ఇస్తుంది. వేల అడుగుల ఎత్తు నుంచి దూకి పారాచూట్‌ ద్వారా ల్యాండ్‌ కావడం సరదాగా అనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పారాచూట్‌ ఫెయిల్‌ అయితే అంతే సంగతులు.. పై ప్రాణాలు పైకే పోతాయి. ఓ స్కైడైవర్‌ విషయంలో కూడా అదే జరిగింది.

బీబీసీ రిపోర్ట్స్‌ ప్రకారం.. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ షైర్‌కు చెందిన నాథీ ఒడిన్సస్‌కు స్కైడైవింగ్‌లో ఏళ్ల అనుభవం ఉంది. తన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తరచూ పోస్ట్‌ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పట్టాయా వెళ్లిన నాథీ.. అక్కడ స్కైడైవింగ్‌ చేయాలని భావించాడు. అయితే.. అందుకు ముందుస్తు అనుమతులు తీసుకోలేదు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో అక్కడ 29వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. అతడి సాహసాన్ని కింద నుంచి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. దురదృష్టవశాత్తూ నాథీ కిందకు దూకిన సమయానికి పారాచూట్‌ తెరుచుకోలేదు. దీంతో అతడు వేగంగా ఓ చెట్టును తాకి కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


నేథన్ గతంలోనూ ఈ అపార్ట్‌మెంట్‌పై పలుమార్లు ఇదే ప్రయత్నం చేశాడని అక్కడి సెక్యూరిటీ గార్డు తెలిపాడు. అతడి చర్యల కారణంగా అపార్ట్‌మెంట్ సమీపంలోని పాదచారులకు ప్రమాదం ఉండేదని చెప్పాడు. ఇక పారాచూట్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. నేథన్ మృతి గురించి పోలీసులు బాంకాక్‌లోని బ్రిటన్ ఎంబసీకి సమాచారం అందించారు. నేథన్ కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఎత్తయిన భవనాలు, ఆకాశ హర్మ్యాల నుంచి పారాచూట్ సాయంతో దూకడాన్ని బేస్ జంపింగ్ అంటారు. ఇందులో పారాచూట్ తెరుచుకునేందుకు తక్కువ సమయం ఉండటంతో ఈ సాహసం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. బేస్ జంపింగ్‌లో సాహసికుడు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Tags

Next Story