Indian student killed in US : అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

అమెరికాలో వివేక్ సైనీ అనే భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. నిరాశ్రయుడని జాలి చూపి.. తిండి పెట్టడమే విద్యార్థి చేసిన పాపమైంది. జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో డ్రగ్స్‌కు అలవాటు పడిన జూలియన్ ఫాల్క్‌నర్ అనే ఓ నిరాశ్రయుడు సుత్తితో సైనీ తలపై దాదాపు 50 సార్లు కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. ఈ నెల 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. బీటెక్ పూర్తిచేసిన సైనీ రెండేండ్ల క్రితమే హర్యానా నుంచి అమెరికాకు వెళ్లాడు.
జార్జియాలోని ఓ ఫుడ్ మార్ట్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు వివేక్ సైని. కాగా.. జులియన్ ఫౌల్క్‌నర్ అనే నిరాశ్రయుడు.. కొన్ని రోజుల క్రితం ఆ ఫుడ్ మార్ట్‌కి వెళ్లాడు. వివేక్‌తో పాటు మార్ట్ సిబ్బంది అతనికి సాయం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆ నిరాశ్రయుడు అక్కడే ఉండిపోయాడు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న మంచి మనసుతో.. ఎవరు ఏం పట్టించుకోలేదు. అతను ఏం అడిగితే అది ఇచ్చారు. మంచి నీరు, చిప్స్, కోక్.. అన్ని ఇచ్చారు. బ్లాంకెట్, జాకెట్ కూడా ఇచ్చారు. సిగరెట్లు అడిగితే.. అవి కూడా ఇచ్చారు. కానీ.. జనవరి 16న.. జులియన్ ఫౌల్క్నర్ని.. ఫుడ్ మార్ట్ విడిచిపెట్టి వెళ్లిపోవాలని చెప్పాడు వివేక్ సైని. లేకపోతే పోలీసులను పిలుస్తామని అన్నాడు. ఈ మాటలు విన్న జులియన్ ఫౌల్క్నర్కు కోపం పెరిగిపోయింది.
పార్ట్ టైమ్ జాబ్ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న వివేక్ సైనిపై ఒక్కసారిగ దాడి చేశాడు జులియన్ ఫౌల్క్‌నర్. సుత్తితో 50సార్లు అతని తలపై కొట్టాడు. వివేక్ సైని అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. రాత్రి 12:30 గంటల ప్రాంతంలో సంబంధిత ఫుడ్ మార్ట్‌కి వెళ్లారు. సుత్తి పట్టుకుని, స్టోర్ సిబ్బందిని బెదిరిస్తున్న జులియన్ ఫౌల్క్నర్ని చూశారు. ఆయుధాన్ని కిందపడేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అతను సుత్తిని కిందపడేశాడు. పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుత్తితో పాటు రెండు కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
వివేక్ సైని మరణవార్తతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. బీటెక్ పూర్తి చేసుకున్న వివేక్ సైని.. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఇటీవలే.. అతనికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com