Bus Accident : ఇటలీలో ఘోర ప్రమాదం…21 మంది మృతి

ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనిస్ సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడింది. మీథేన్‌తో నడుస్తున్న బస్సు కింద పడుతున్నప్పుడే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటన ఇద్దరు పిల్లలు, విదేశీయులతో ఈ ప్రమాదం 21 మందిని బలితీసుకుంది. 40 మంది గాయపడినట్లు అంచనా. ప్రమాద సమయంలో ఆ బస్సులో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై వెనిస్ మేయర్ లుయిగి బ్రుగ్నారో విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ఘోరమైన విషాదంగా అభివర్ణించారు. ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదం అలముకుందన్నారు. ‘‘ఈ బస్సు ప్రమాద ఘటనలో 21 మరణించగా, మరో 20 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు’’ అని వెనిస్ ప్రాంత గవర్నర్ లూకా జైయా చెప్పారు. మృతదేహాలను వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని గవర్నర్ తెలిపారు. బాధితులు,క్షతగాత్రుల్లో ఇటాలియన్లు మాత్రమే కాకుండా పలుదేశాల ప్రజలు ఉన్నారు.
బస్సు వెనిస్‌లోని చారిత్రాత్మక కేంద్రం నుంచి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర ఇటాలియన్ నగరంలోని మెస్ట్రే, మర్గెరా జిల్లాలను కలుపుతూ రైలు మార్గాన్ని దాటుతున్న వంతెనపై నుంచి బస్సు వస్తుండగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. బస్సు మీథేన్ గ్యాస్‌తో నడిచిందని, విద్యుత్ తీగలపై పడి మంటలు చెలరేగాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com