Khalistani Arrest: కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాద కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖలిస్థాన్ రెఫరెండం ప్రధాన నిర్వాహకుడిగా, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్న ఇందర్‌జిత్ సింగ్ గోసల్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది గుర్‍పత్వంత్ సింగ్ పన్నూన్‌కు గోసల్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
గతంలో కూడా గోసల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ దేవాలయంపై జరిగిన హింసాత్మక దాడికి సంబంధించి గత ఏడాది నవంబర్‌లో కూడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే, పీల్ రీజినల్ పోలీసులు అతడిని ఆ తర్వాత విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
2024 నవంబరులో బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరం వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న హిందూ-కెనడియన్ భక్తులపై కొందరు ఖలిస్థానీ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలు, బ్యానర్లతో మొదలైన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారి భక్తులపై భౌతిక దాడులకు దారితీశాయి. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు కెనడాలో ముఖ్య నిర్వాహకుడిగా గోసల్ వ్యవహరిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com