Canada: భారతీయ విద్యార్థి మృతి

Canada: భారతీయ విద్యార్థి మృతి
గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో మృతి చెందిన విద్యార్థి

దేశం కానీ దేశంలో చదువుకుందామని వెళ్లిన ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓవైపు చదువుకుంటూ, పార్ట్ టైం పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గుర్‌విందర్‌ నాథ్‌ అనే విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

2021లో పై చదువులకోసం కెనడా వచ్చిన గుర్‌విందర్‌ నాథ్‌ ఖాళీ సమయంలో ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే జులై 9న మిస్సిసాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్‌విందర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి, అతడి వాహనాన్ని దొంగిలించిన్నట్టుగా స్థానిక మీడియా చెబుతోంది. . ఈ దాడిలో గుర్‌విందర్‌ తల, ఇతర శరీర భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ కార్యాలయం తెలిపింది. గుర్‌విందర్‌ నుంచి వాహనాన్ని దొంగిలించాలనే ప్రణాళికతోనే నిందితులు పిజ్జా ఆర్డర్‌ చేసినట్లు విచారణలో తెలిసింది. దాడి తరువాత నిందితుల్లో ఒక వ్యక్తి గుర్‌విందర్‌ వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దాడి జరిగిన కాసేపటికి ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నిందితుడు వాహనాన్ని విడిచి వెళ్లాడు. ప్రస్తుతం వాహనాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించామంటున్న స్థానిక పోలీసులు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

గుర్‌విందర్‌ మృతి ఎంతో బాధాకరమని, అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ సిద్ధార్థ్‌ నాథ్‌ ప్రకటించారు. గుర్‌విందర్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జులై 27న గురువిందర్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2021లో కెనడాకి వచ్చిన గురువిందర్ ప్రస్తుతం చివరి సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి కాగానే సొంతగా బిజినెస్ చేయాలని కలలు కన్నాడని, అంతలోనే ఇలా జరగడం ఎంతో బాధాకరమని అతడి స్నేహితులు తెలిపారు. గుర్‌విందర్‌పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్‌ లైట్ మార్చ్‌ నిర్వహించారు.

Tags

Next Story