Canada PM Divorce: మేం విడిపోతున్నాం

Canada PM Divorce: మేం విడిపోతున్నాం
X
18ఏళ్ల వివాహ బంధానికి బైబై చెప్పిన కెనడా ప్రధాని దంపతులు

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోయారు. తన భార్య సోఫీ గ్రెగోయిర్ నుండి విడిపోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు సోఫీ కూడా..భర్త నుంచి విడిపోతున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. చట్టబద్దంగా విడిపోయే ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేసినట్లు కెనడా ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ప్రపంచంలో మరో దేశాధినేత విడాకులకు సిద్ధమయ్యారు. కెనడా ప్రధాని తన భార్యతో విడిపోతున్నట్టు వెల్లడించారు. 2005లో వీరి వివాహం జరగ్గా.. 18 ఏళ్ల అనంతరం విడాకులకు సిద్ధమయ్యారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగోయిర్ ట్రూడో దంపతులకు ముగ్గురు పిల్లలు. 15ఏళ్ల జేవియర్, 14ఏళ్ల ఎల్లా -గ్రేస్, తొమ్మిదేళ్ల హాడ్రియన్. విడిపోవడానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో తన పిల్లలకు ఒక కుటుంబంలా ఉంటానని జస్టిన్ ట్రూడో తెలిపారు. పిల్లలనుసురక్షితమైన, ప్రేమ పూర్వక వాతావరణంలో పెంచడంపై ఇద్దరూ దృష్టిపెడతామని చెప్పారు.


మూడేళ్ల కిందట 2020 నాటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. భార్య సోఫీని పొగడ్తల్లో ముంచెత్తిన ట్రూడో ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంపై వారి అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 48ఏళ్ల సోఫీ గ్రెగోయిర్ ట్రూడో క్యూబెక్లో టెలివిజన్ రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె 51ఏళ్ల జస్టిన్ ట్రూడోతో కలిసి మూడు ఎన్నికలకు కూడా ప్రచారం చేశారు. ఆమె మహిళల హక్కులు, మానసిక ఆరోగ్య సమస్యలకోసం వాదించడం ద్వారా చాలాసార్లు వార్తల్లో నిలిచారు. ఇదిలాఉంటే పదవిలో ఉండగా భార్య నుంచి విడిపోయిన రెండో ప్రధాని జస్టిన్ ట్రూడో. అంతకుముందు అతని తండ్రి పియరీ ట్రూడో భార్య మార్గరెట్ నుండి విడిపోయారు.

Tags

Next Story