Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు..
స్పెయిన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తూర్పు ప్రాంతమైన వాలెన్సియాలో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కార్లు, ఇతర వాహనాలను నీటిలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రహదారులను బురదనీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు దక్షిణ స్పెయిన్ లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని సుంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితులన్ని గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
స్పెయిన్ లోని తూర్పు, దక్షిణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రైళ్లు, విమానాలను రద్దు చేశారు. వాలెన్సియా విమానాశ్రయంలో దిగాల్సిన 12 విమానాలను స్పెయిన్ లోని ఇతర నగరాలకు మళ్లించినట్లు స్పానిష్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరో పది విమానాలను రద్దు చేశారు. రైళ్లను కూడా రద్దు చేశారు. అయితే, మాడ్రిడ నుంచి అండలూసియాకు వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం సమయంలో రైలులో 276 మంది ప్రయాణికులు ఉన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ట్విటర్ లో స్పందించారు. తప్పిపోయిన వ్యక్తులు, తుపాను కారణంగా సంభవించిన నష్టం గురించి ఆందోళన చెందుతున్నా. అధికారుల సలహాలను ప్రజలు అనుసరించాలి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో రోడ్లుపై నిలిపిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com