భారత్ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల..

భారత్ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న వేళ భారత్‌కు చికాకు పెట్టేట్లుగా చైనా వ్యవహరించింది. పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్థాన్‌కి అన్ని స్థాయిల్లో సహాయ సహకారాలు వస్తోంది. యునైటైడ్ నేషన్స్‌ సమావేశంలో భారత్ చేసిన ప్రపోజల్‌కి చైనా మళ్లీ అడ్డుపుల్ల వేసింది. ఎంతో మందిని బలికొన్న ముంబయి ఉగ్రదాడుల కేసులో నిందితులను శిక్షించాలన్న భారత్ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉంది. తాజాగా ముంబయి ఉగ్రదాడులకు మాస్టర్‌ మైండ్, దాడుల వ్యూహకర్తగా భావిస్తున్న పాకిస్థాన్‌ లష్కర్‌-ఈ-తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ చేసిన ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. అమెరికా, భారత్ కలిసి చేసిన ఈ ప్రతిపాదనను అడ్డుకోవడానికి చైనా తనకున్న వీటో ఉపయోగించింది. భారత్ చర్యలకు అమెరికా ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతూనే ఉంది. ఉగ్రవాది సాజిద్ మిర్‌ తలపై ఇప్పటికే 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.

చైనా చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ గుప్తా యునైటైడ్ నేషన్స్ ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో మాట్లాడుతూ... "భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నట్లయితే, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మనం నిబద్ధతతో లేనట్లే" అని చైనా పేరుని ఎత్తకుండానే విమర్శించారు. 2008 మంబాయి ఉగ్రదాడులు, 2016 పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ దాడులు, 2019లో పుల్వామా వంటి గాయాలను మూడు దశాబ్ధాలుగా మోస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఎందరో అమాయకులు, అధికారుల్ని, సైనికుల్ని కోల్పోయామన్నారు. కానీ దాడులు జరిగి 15 యేళ్లు గడిచినా ఇప్పటికీ బాధితులకు న్యాయం దొరకటం లేదన్నారు.


ముంబయి దాడుల్లో పాకిస్థాన్ పాత్ర ఉందని 2022 లో విడుదలైన ఉగ్రవాది సాజిద్ మిర్ ఆడియో ద్వారా బట్టబయలయింది. అయినా పాకిస్థాన్ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. అందులో ఉగ్రవాదులకు సాజిద్ మిర్ స్వయంగా దిశా నిర్ధేశం చేస్తున్నట్లుగా బయటపడింది. 2021 సంవత్సరంలో సాజిద్ మరణించినట్లు పాక్ అధికారులు ప్రకటించారు కూడా.

ముంబయి ఉగ్రదాడుల నిందితులను చట్టం ముందు పెట్టాలన్న భారత్ ప్రయత్నాల్ని చైనా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంది. ఇటీవల కాలంలో 5 సార్లు ఇటువంటి ప్రతిపాదనల్ని అడ్డుకుంది. ఈ చర్యలు భారత్‌కు తీవ్ర అసహనాన్ని తెస్తున్నాయి.

ఇటీవలి కాలంలో భారత్-అమెరికా ప్రతిపాదనలను చైనా అడ్డుకోవడం ఇది ఐదవ సారి. అక్టోబర్‌లో లష్కరే తోయిబా(LeT) సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్‌లో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది సాజిద్ మీర్, ఎల్‌ఈటి మరియు జమాత్-ఉద్-దవా జూన్‌లో (JuD) నాయకుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, అలాగే ఆగస్టులో జైషే మహ్మద్ (JEM) చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌లకు ఆంక్షల నుంచి బీజింగ్ అధినాయకత్వం రక్షించింది.

భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రయత్నాలను చైనా తన వీటో అధికారంతో అడ్డుతగులుతోంది. ఇతర శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఈ ప్రతిపాదనకు సానుకూలంగానే ఉన్నాయి. భద్రతామండలిలో భారత్‌కు చోటు కల్పిస్తే ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యం సాగదనే భయంతోనే చైనా భయపడుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం.





Tags

Next Story