US visa: వీసా స్లాట్స్ కోసం తరచూ చెక్ చేసుకోండి :అమెరికా

విదేశీ విద్యార్థులకు సంబంధించి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను ట్రంప్ యంత్రాగం ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇది తాత్కాలికమేనని, త్వరలోనే ఈ స్లాట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందుకోసం విదేశీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే విషయమై తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది.
‘‘ప్రస్తుతానికి కొంత ఆలస్యం కావచ్చు. అయితే, స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయనే విషయాన్ని తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నా. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పనప్పటికీ.. సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడంపై ట్రంప్ యంత్రాంగం దృష్టి సారించిందని, వీసా ప్రక్రియ కూడా అందులో ప్రధాన భాగమని అన్నారు. వీసా అనేది జన్మహక్కు కాదని, ఇదో ప్రత్యేక అవకాశం అని మరో ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.
విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా.. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో భారతీయులు సహా విదేశీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ ఈ స్లాట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయమై సందిగ్ధత నెలకొన్న వేళ అమెరికా విదేశాంగశాఖ ఈ విధంగా స్పందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com