Pakistan: పాకిస్తాన్ లో వానకాలం పెళ్ళిళ్ళు,

పాకిస్థాన్‌లో రెండేళ్ళ క్రితం 2022లో సంభవించిన వరదల ప్రభావం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నది. అయితే అది పేదరికం రూపంలోనే. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్థిక అభద్రతా భావం ఆడ పిల్లల జీవితాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నది. జూలై-సెప్టెంబరు మధ్య కాలంలో కురిసే భారీ వర్షాలు, సంభవించే వరదలు, కొండచరియలు విరిగిపడటం, పంట నష్టాలు వంటివాటికి రైతులు భయపడిపోతున్నారు. తమ కుటుంబ ఆర్థిక భద్రత కోసం తమ మైనర్ కుమార్తెలకు పెండ్లి చేస్తున్నారు. తమ కుమార్తెల వయసు కన్నా రెట్టింపు వయసుగల పురుషుల నుంచి సుమారు రూ.2 లక్షలు తీసుకుని, వారితో వివాహాలు చేస్తున్నారు.
2022లో సంభవించిన వరదల వల్ల పాకిస్థాన్‌లో మూడొంతుల భాగం జలమయమైంది. ఈ ప్రభావం నుంచి సింధ్ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. దీంతో ‘వానాకాలం వధువు’ల (మాన్‌సూన్ బ్రైడ్స్) ట్రెండ్ ప్రారంభమైందని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ సంస్థ వ్యవస్థాపకుడు మషూక్ చెప్పారు. పురుషుల కుటుంబాల నుంచి డబ్బు తీసుకుని, తమ మైనర్ కుమార్తెలకు కొందరు తల్లిదండ్రులు పెండ్లి చేస్తున్నారన్నారు. గత వర్షాకాలం నుంచి తమ గ్రామంలో 45 మంది మైనర్ బాలికలకు వివాహాలు జరిగినట్లు ఖాన్ మహమ్మద్ మల్లాహ్ గ్రామ పెద్ద చెప్పారు.
తమ పిల్లలను పేదరికం నుంచి కాపాడటం కోసమే వారికి వివాహం చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్తున్నారు. మరోవైపు, బాల్యంలో వివాహం చేసుకున్న మైనర్ బాలికల్లో చాలా మందికి జీవనోపాధి కరువవుతున్నది. భర్తకు ఉపాధి లేకపోవడం, తమ ఆలనాపాలనా చూసుకోకపోవడంతో విసుగుచెంది భర్త, పిల్లలతో సహా తిరిగి తమ పుట్టింటికి వస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com