అంతర్జాతీయం

వికటించిన చైనా కరోనా వ్యాక్సిన్.. టీకా తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?

వికటించిన చైనా కరోనా వ్యాక్సిన్.. టీకా తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?
X

కరోనా వ్యాక్సిన్‌ రేసులో ముందున్నామని గొప్పలు చెప్పుకున్న చైనాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్రెజిల్‌, చైనా సంయుక్తంగా రూపొందిస్తున్న కరోనావాక్‌ ప్రయోగాలు చివరి దశలో వికటించాయి.. వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలు కనిపించాయి.. దీంతో బ్రెజిల్‌లో ప్రయోగాలు నిలిచిపోయాయి. చైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిజానికి టీకా బ్రహ్మాండంగా పనిచేస్తోందని బ్రెజిల్‌కు చెందిన బయోమెడికల్‌ పరిశోధనా కేంద్రం బుటాంటన్‌ ఇన్‌స్టిట్యూట్‌ గతంలో ప్రకటించింది.. కానీ, తాజా పరిణామాలు అందుకు భిన్నంగా వున్నాయి.. బ్రెజిల్‌లో చైనా టీకా వేసుకున్న వారంతా ఇప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయోనని భయాందోళన చెందుతున్నారు.

కరోనావాక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో మరణాలు సంభవించగా.. చాలా మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది.. కొంతమందికి దీర్ఘకాలిక ప్రభావం కలిగిన, తీవ్ర అనారోగ్యానికి దారితీసే పరిస్థితులు తలెత్తాయి. అక్టోబరు 29న ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి మీడియా ద్వారా వివరాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. అయితే, ప్రయోగాలు నిర్వహిస్తున్న సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి మాత్రం ఎలాంటి వివరణా వెలువడలేదు. అయితే, ఈ ఆటంకాలు సాధారణమేనని సినోవాక్‌ సంస్థ చెబుతోంది.. పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఆస్ట్రాజెనకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సహా అనేక ప్రయోగాలు కూడా ఇలాగే ఆగి మరలా ప్రారంభమయ్యాయని చెబుతోంది.. అయితే లక్షల మంది చైనా ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ఇప్పటికే ప్రారంభం కావటంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

చైనా తొందరపాటు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ తయారు చేయాలంటే సంవత్సరాల సమయం పడుతుంది.. కానీ, ప్రపంచదేశాలన్నిటి కంటే ముందే కరోనాకు టీకాను కనుక్కోవాలనే ఆతృతతో చైనా దూకుడు ప్రదర్శించింది.. వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియమాలన్నిటినీ సడలించి వ్యవధిని కుదించగా, ప్రభుత్వాలు కూడా చేయూత అందిస్తున్నాయి.. అయితే, హడావిడి ప్రయత్నాల కారణంగానే ఫలితాలు వికటించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండోనేషియా, టర్కీలో కూడా సినోవాక్ మూడో దశ ప్రయోగాలు సాగుతుండగా, కరోనా వైరస్‌పై చైనాకు చెందిన 4 కంపెనీల వ్యాక్సిన్లు ప్రస్తుతం 3వ దశలో ప్రయోగాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రయోగాత్మకంగా చైనా పరిశీలిస్తోంది. ఈ మేరకు పలు దేశాలతో చైనా ఒప్పందాలు సైతం చేసుకుంది. అక్టోబరు 20 నాటికి 60వేల మందికిపైగా వాలంటీర్లపై ఈ నాలుగు రకాల టీకాలను ప్రయోగించగా, ఏ ఒక్కరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని చైనా ప్రభుత్వం చెబుతోంది.. తాజా పరిణామాలతో టర్కీ, ఇండోనేషియా టీకా ప్రయోగాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Next Story

RELATED STORIES