DALAILAMA: అమెరికాపై భగ్గుమన్న చైనా

DALAILAMA: అమెరికాపై భగ్గుమన్న చైనా
దలైలామాతో అమెరికా అధికారి భేటీ కావడంపై చైనా ఆగ్రహం... తమ అంతర్గత విషయాల్లో జోక్యం వద్దని హెచ్చరిక....

అమెరికా, చైనా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ.. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అగ్రరాజ్య అధికారితో సమావేశం కావడాన్ని డ్రాగన్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కార్యవర్గంలో మానవహక్కుల విభాగం అత్యున్నత అధికారి ఉజ్రా జియాతో దలైలామా భేటీ అయ్యారు. ఢిల్లీలో సమావేశమైన వీరిద్దరూ మానవ హక్కుల పరిరక్షణపై చర్చలు జరిపారు. ఈ సమావేశంపై చైనా భగ్గుమంది. అమెరికా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని హెచ్చరించింది. 14వ దలైలామా కేవలం మతపరమైన వ్యక్తి కాదని... సుదీర్ఘ కాలంగా చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తని డ్రాగన్‌ విమర్శించింది.


టిబెట్‌ తమ దేశంలో అంతర్భాగమనిదాని నిబద్ధతకు కట్టుబడి ఉండేందుకు అమెరికా గట్టి చర్యలు తీసుకోవాలని భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి వాంగ్‌ షియావ్‌జియాన్‌ స్పష్టం చేశారు. చైనా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం ఆపాలని స్పష్టం చేశారు. దలైలామా బృందం చేపట్టే చైనా వ్యతిరేక కార్యకలాపాలకు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని ఆయన అమెరికాకు సూచించారు.


టిబెట్‌ వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గతమైనవని. వీటిల్లో బాహ్యశక్తుల జోక్యానికి ఎటువంటి అర్హత లేదని డ్రాగన్ స్పష్టం చేసింది. టిబెట్‌ స్వాతంత్ర్యం కోరుకొనే శక్తులు విదేశీ దౌత్యవేత్తల మధ్య ఎటువంటి సంబంధాలనైనా తాము బలంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. అమెరికా ఉన్నతాధికారి ఉజ్రా జియాకు అక్కడి ప్రభుత్వం టిబెట్‌ వ్యవహారాల సమన్వయకర్త హోదా ఇవ్వడం పూర్తిగా నేరపూరితమని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, టిబెట్‌లో అభివృద్ధి, స్థిరత్వాన్ని తక్కువ చేసి చూపడానికి తీసుకొన్న చర్యగా అభివర్ణించింది. టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని పూర్తిగా వేర్పాటువాద రాజకీయ సంఘంగా చైనా పేర్కొంది. దానికి ప్రపంచంలో ఏ దేశం గుర్తింపు లభించలేదని గుర్తు చేసింది.


అమెరికా మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోదలైలామాతో భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ సహాయమంత్రి డోనాల్డ్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఉజ్రా జియా జులై8 నుంచి 14వ తేదీ వరకు భారత్‌, బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె భారత్‌లోని ఉన్నతాధికారులను కూడా కలవనున్నారు. ప్రపంచ సవాళ్లు, ప్రజాస్వామ్యం, ప్రాంతీయ స్థిరత్వం, సహకారంపై ఈ పర్యటనలో అమెరికా ఉన్నతాధికారి చర్చలు జరపనున్నారు. అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సీనియర్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరపనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story