అంతరిక్ష రంగంలో అరుదైన గుర్తింపు సాధించిన చైనా

అంతరిక్ష రంగంలో అరుదైన గుర్తింపు సాధించిన చైనా

చైనా అరుదైన గుర్తింపును సాధించింది. అంతరిక్ష రంగంలో అగ్రశక్తిగా ఎదగాలనుకుంటున్న డ్రాగన్‌.. చంద్రుడిపై జెండాను ఎగరేసింది. అమెరికా తర్వాత జాబిల్లిపై జెండా ఎగరేసిన రెండో దేశంగా అవతరించింది. చంద్రుడి మట్టి, శిలల నమూనాలు తీసుకొచ్చేందుకు ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక ద్వారా ఈ ఘనత సాధించింది.

చైనా ప్రయోగించిన వ్యోమనౌక చాంగే-5లో... ఆర్బిటర్‌, ల్యాండర్‌, అసెండర్‌, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. ఆర్బిటర్‌-రిటర్నర్‌ భాగం చంద్రుడి కక్ష్యలోనే ఉండిపోగా.. ఈ నెల 1న ల్యాండర్‌-అసెండర్‌ జాబిల్లిపై కాలుమోపింది. రోబోటిక్‌ పరిజ్ఞానంతో అక్కడి మట్టి, శిలల నమూనాలు సేకరించింది. ఈ నమూనాలతో అసెండర్‌ భాగం శుక్రవారం నింగిలోకి దూసుకెళ్లింది.

ల్యాండర్‌-అసెండర్‌పై చైనా జాతీయ జెండా విచ్చుకుంది. ఈ పతాకం పొడవు 90 సెంటీమీటర్లు కాగా.. వెడల్పు రెండు మీటర్లు ఉంది. 1969లో మానవసహిత యాత్ర ద్వారా అమెరికా తొలిసారి చంద్రుడిపై తమ జాతీయ జెండాను ఆవిష్కరించింది. చాంగే-5 అసెండర్‌లోని రాకెట్‌ను ఆరు నిమిషాల పాటు మండించడంతో... ఆర్బిటర్‌ ఉన్న కక్ష్యలోకి చేరింది. ఆ తర్వాత ఆర్బిటర్‌తో అనుసంధానమవుతుంది. జాబిల్లి నమూనాలు రిటర్నర్‌ క్యాప్స్యూల్‌లోకి చేరవేస్తుంది.

తిరుగుప్రయాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు రిటర్నర్‌ భాగం.. భూమి దిశగా పయనమవుతుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలో దిగుతుంది. అమెరికా, రష్యా తర్వాత... చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలు తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా అవతరించనుంది. చివరిసారిగా 1976లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన లూనా-24... ఆ నమూనాలను తీసుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story