బైడెన్‌కు చైనా స్ట్రాంగ్ కౌంటర్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నియంత అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బైడెన్‌ది చాలా పెద్ద నోరని ఎద్దేవా చేసింది. అగ్రరాజ్య అధినేత విమర్శలు అత్యంత అసంబద్ధం, బాధ్యతారాహిత్యమని చైనా మండిపడింది. బైడెన్ వ్యాఖ్యలు వాస్తవాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ విమర్శించారు. అమెరికా అధినేత విమర్శలు దౌత్యపరమైన ప్రోటోకాల్‌ను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని.. చైనా గౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తున్నాయని మావోనింగ్ మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించిన చైనా.. దీనిపై తీవ్ర అసంతృప్తిని, వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బైడెన్ వ్యాఖ్యలు అమెరికా- చైనా మధ్య ఉద్రిక్తతలను మరోసారి పెంచాయి. చైనాలో పర్యటిస్తున్న వేళ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్.. జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పెడ్తాయని భావిస్తున్న వేళ బైడెన్ విమర్శలు మరోసారి అగ్గిరాజేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com