China Hospitals: నూటికి 90 మంది కరోనా బాధితులు.. క్రిక్కిరిసిన చైనా ఆసుపత్రులు
China Hospitals: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కేసులు, మరణాల సంఖ్యను చైనా తొక్కిపెడుతున్నప్పటికీ.. ఆ దేశంలో మునుపెన్నడూ లేనంత కేసులు నమోదవుతున్నాయి. నిజానికి ఇదే వైరస్ అమెరికా, యూరప్ దేశాల్లో చాలా ఉధృతంగా కనిపించింది. కాని ఆ దేశాల్లో బీఎఫ్-7 వేరియంట్ సోకిన వాళ్లు తీవ్ర అనారోగ్యానికి గురవడం, ఆసుపత్రిపాలవడం తక్కువగానే కనిపించింది.
అదేంటోగానీ.. చైనాలో మాత్రం తాటతీస్తోందీ వైరస్. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య లెక్కలకు అందనంతగా ఉంది. ఇక మరణాల సంఖ్య కూడా చైనాలో భారీగానే కనిపిస్తోంది. భారత్‌తో సహా ఇతర దేశాల వాళ్లు డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను చూశారు, తట్టుకున్నారు. కాని, చైనా మాత్రం ముందు నుంచి జీరో కొవిడ్ ఆంక్షలు పెట్టింది. దీంతో డెల్టా, ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్లు చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు జీరో కొవిడ్ ఆంక్షలు తొలగించడంతో.. ఈ బీఎఫ్-7 వేరియంట్ బారిన పడుతున్నారు.
అందులోనూ చైనీయుల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువ. దానికి తోడు చైనాలో వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరగలేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చైనా తయారు చేసిన టీకాలకు అసలు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్ధ్యమే లేదని చెబుతున్నారు. ఇవన్నీ చైనాలో మరణమృదంగానికి కారణమవుతున్నాయి.
చైనాలో కరోనా ఆంక్షలు తీసేయడంతో జనం స్వేచ్ఛగా బయట తిరుగుతారు అనుకున్నారు. కాని, లక్షల మంది చైనీయులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఎంతలా అంటే ఆస్పత్రులకు వస్తున్న వారి వాహనాల కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రతి ఆస్పత్రిలో వందకు 90 మంది కరోనా బాధితులే ఉంటున్నారు. దీంతో కరోనా బాధితులతో చైనా ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
ఇక షాంఘైలో అయితే ఆస్పత్రులు, ఎమర్జెన్సీ వార్డులన్నీ స్ట్రెచర్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి చాలా మంది బాధితులకు ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. హాస్పిటల్‌లో బెడ్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఆస్పత్రుల్లోని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. వృద్ధులపై ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో చనిపోయిన వారిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు సరిపోవడం లేదు. మరోవైపు, స్మశానాల్లోనూ ఖాళీ లేకపోవడంతో అక్కడ కూడా వెయిటింగ్ తప్పడం లేదు. చైనాలో ఇంత దీనావస్థ గతంలో ఎన్నడూ లేదు.
చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ షాకింగ్ విషయాలు వెల్లడించింది. చైనాలో రికార్డు స్థాయిలో రోజుకు 10 లక్షలకు పైగా కేసులు, 5 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం వచ్చే నెల నాటికి చైనాలో రోజువారీ కరోనా కేసులు 37 లక్షలకు చేరుకుంటుందని, మార్చి నాటికి ఆ సంఖ్య రోజుకు 42 లక్షలకు చేరే ప్రమాదం ఉందని చెబుతోంది. ప్రస్తుతం చైనాలో ఫస్ట్‌వేవ్ నడుస్తోంది. జనవరి రెండో వారం తరువాత సెకండ్ వేవ్ మొదలవుతుందని, ఫిబ్రవరి చివరి నుంచి మార్చి రెండో వారం వరకు థర్డ్ వేవ్ కొనసాగుతుందని లండన్ పరిశోధన సంస్థ అంచనా వేసింది.
చైనాలో కరోనా విజృంభిస్తుండడంతో.. విదేశీ టీకాలను దేశంలోకి అనుమతిస్తోంది. ఇప్పటి వరకు సినోవ్యాక్ పేరుతో తయారుచేసుకున్న స్వదేశీ టీకాలను మాత్రమే అనుమతించిన చైనా.. కేసుల సంఖ్య కోట్లల్లోకి చేరుకోవడంతో విదేశీ టీకాలనూ అనుమతించింది.
జర్మనీ చాన్స్‌లర్ గత నెలలో చైనాను సందర్శించినప్పుడు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. చైనా ఒక విదేశీ వ్యాక్సిన్‌ను అనుమతించిందంటేనే.. ఆ దేశంలో ఎలాంటి భయంకర పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com