Chang’e 6: భూమికి చేరిన జాబిల్లి ఆవలిభాగం నమూనాలు
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవలివైపు నమూనాలను సేకరించి, వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండోవైపు నుంచి మట్టితో చాంగే-6 వ్యోమనౌక మంగళవారం పుడమిని చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు.
మే 3న నింగికెగిరిన చాంగే-6.. జూన్ 2న జాబిల్లి ఆవలివైపున సౌత్ పోల్-అయిట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో సురక్షితంగా దిగింది. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. ఈ నెల 4న.. నమూనాలతో చంద్రుడి ఉపరితలం నుంచి బయలుదేరి, చందమామ కక్ష్యలోకి చేరింది. అనంతరం భూమి దిశగా పయనాన్ని ఆరంభించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటలకు చాంగే-6లోని రిటర్నర్ క్యాప్సూల్.. పారాచూట్ల సాయంతో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో సురక్షితంగా దిగింది. ఇందులో 2 కిలోల మేర జాబిల్లి నమూనాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్యాప్సూల్‌ను వాయు మార్గంలో బీజింగ్ తరలించి, అక్కడ తెరుస్తారు. చందమామ నమూనాలను శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తారు. చంద్రుడి ఆవిర్భావం గురించి ఇది మరిన్ని కొత్త వివరాలను వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తోంది. ఇవతలి భాగం నియర్ సైడ్ గా పేర్కొంటారు. రెండో భాగం ఫార్ సైడ్‌గా పిలుస్తారు. ఇప్పటి వరకూ అమెరికా, సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి, శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా వేరుగా ఉంటాయని రిమోట్ సెన్సింగ్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతమంతా అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల భారీ బిలాలు ఏర్పడ్డాయి. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో వేరుగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ ప్రయోగం వల్ల జాబిల్లి రెండు పార్శ్వాలకు మధ్య ఉన్న వైరుధ్యాల గురించి కూడా తెలుస్తుందని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com