చైనాలో మళ్లీ కరోనా విజృంభణ...కొత్తగా కేసులు ఎన్నంటే..?

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి తిరిగి తిరిగి మళ్లీ చైనాను చేరింది. గత కొన్ని రోజులుగా అక్కడ డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు 11 నాటికి కనీసం 17 ప్రావిన్సుల్లో 143 కొత్త కేసులు వెలుగుచూసినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇందులో 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 108 స్థానికంగా నమోదైన కేసులే. జియాంగ్జు ప్రావిన్స్‌లో అత్యధిక కేసులు బయటపడ్డాయి.
దీంతో అప్రమత్తమైన డ్రాగన్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి అధికారులు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. తలుపుల ముందు ఇనుప రాడ్ల పెట్టి ఇంటిని సీల్ చేస్తున్నారు. పీపీఈ కిట్లలో ఉన్న అధికారులు కొందరు ఇళ్ల ముందు ఇనుపరాడ్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఒక రోజులో మూడు సార్లు మాత్రమే బయటకు రావాలి. అంతకంటే ఎక్కువ సార్లు బయటకు వచ్చినా.. పదే పదే తలుపులు తెరిచినట్లు ఫిర్యాదులు అందినా.. వెంటనే అధికారులు వారి ఇంటిని చేరుకుని బయటి నుంచి తాళాలు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా డోర్ల ముందు X ఆకారంలో ఇనుప రాడ్లు బిగిస్తున్నారు.
ఇక అపార్ట్‌మెంట్లలో ఎవరికైనా కరోనా సోకినా లేదా.. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కాంటాక్ట్ పర్సన్ అని తేలినా.. ఆ భవనాన్ని రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తిగా సీల్ చేస్తున్నారు. చైనాలో ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడం కొత్త కాదు. గతేడాది వుహాన్ నగరంలో కరోనా విజృంభణ సమయంలోనూ ప్రజల ఇళ్లకు అధికారులు తాళాలు పెట్టి వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com