China Visa: భారతీయులకు భారీగా చైనా వీసాలు. నిబంధనల్లో సడలింపులు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలను చేపట్టిన తర్వాత ప్రపంచమంతా గందరగోళంలో పడిపోయింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా అస్థిరత్వానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా చైనా పట్ల ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చైనా తాము కూడా తగ్గబోమంటూ అమెరికా పట్ల అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది.
ఈ క్రమంలో చైనా దౌత్య విధానంలో చాలా మార్పు కనిపిస్తోంది. భారత్ కు అనుకూలంగా తన ధోరణిని మార్చుకుంటోంది. భారతీయులకు భారీ సంఖ్యలో వీసాలను మంజూరు చేయడం దీనికి ఒక ఉదాహరణ.
భారత్ లోని చైనా రాయబారి క్సూ ఫీహోంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు 85 వేలకు పైగా భారతీయులకు వీసాలను చైనా మంజూరు చేసింది. పెద్ద సంఖ్యలో భారతీయ స్నేహితులకు చైనా ఆహ్వానం పలుకుతోందని ఆయన అన్నారు. నిజయతీగా ఉండే స్నేహపూర్వకమైన చైనాలో హాయిగా గడపండి అని భారతీయులను కోరారు.
భారతీయులకు చైనా సడలించిన వీసా నిబంధనలు ఇవే:
భారత్-చైనాల మధ్య ప్రయాణం సులభతరంగా ఉండే విధంగా చైనా ప్రభుత్వం వీసా నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు చైనా రెడ్ కార్పెట్ పరుస్తోంది. చైనా సంస్కృతి, పండుగలను ఆస్వాదించాలని, సుందరమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భారతీయులకు చైనా ఆహ్వానం పలుకుతోంది.
చైనాకు వెళ్లాలనుకునే భారతీయులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వీసా సెంటర్ కు వెళ్లి వీసా అప్లికేషన్ ను దరఖాస్తు చేయవచ్చు.
కొన్ని రోజుల పాటు మాత్రమే (షార్ట్ టైమ్) చైనాలో గడపాలనుకునే వారు బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని వల్ల ప్రాసెసింగ్ టైమ్ తగ్గుతుంది.
భారతీయ ప్రయాణికులకు చైనా వీసా ధరను కూడా తగ్గించింది. దీని వల్ల తక్కుత ఖర్చుతో చైనాకు వెళ్లొచ్చు. వీసా ధర తగ్గించడం వల్ల ఎక్కువ మంది భారతీయులు చైనాను సందర్శించవచ్చనే భావనలో చైనా ప్రభుత్వం ఉంది.
గతంలో చైనా వీసాలకు ప్రాసెసింగ్ టైమ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే వీసాలను జారీ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com