China: కొత్త వైరస్ కాదు అవి సీజనల్ నిమోనియా సమస్యలే

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భయాందోళనలకు చైనా తెరదించింది. చిన్నారుల్లో నిమోనియా కేసులు పెరుగుదలకు కొత్త వైరస్ కారణం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక నివేదికను సమర్పించింది. తాము కోరిన నివేదికను చైనా వేగంగా అందించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. బీజింగ్, లియోనోంగ్‌లో తాజా కేసులపై కూడా ఆరా తీసినట్లు వెల్లడించింది.
ఉత్తర చైనాలో చిన్నారులు వరుసగా శ్వాసకోస సంబంధిత సమస్యల బారిన పడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మళ్లీ కరోనా మాదిరి ఏదైనా కొత్త వైరస్ పుట్టుకొచ్చిందా అనే భయాలు వెంటాడాయి. అయితే ఆ భయాందోళనలన్నింటికి తెరదించుతూ చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక నివేదికను అందించింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని డబ్ల్యూహెచ్‌వోకు అందించిన నివేదికలో పేర్కొంది. చైనా నుంచి తమకు నివేదిక అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. బాధితుల్లో ఎటువంటి సరికొత్త వైరస్ లేదని చైనా వివరణ ఇచ్చినట్లు చెప్పింది. శ్వాసకోశ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేవలం 24 గంటల్లోనే చైనా కచ్చితమైన సమాచారాన్ని అందించిందని ఆ దేశానికి చెందిన సీజీటీఎన్ మీడియా తెలిపింది. బీజింగ్, లియోనోంగ్‌లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-సీడీసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. బీజింగ్ పిల్లల ఆస్పత్రి నుంచి కూడా సమాచారం కోరింది. తాము సీడీసీ నుంచి పొందిన డేటా ప్రకారం మైకోప్లాస్మాలో ఎటువంటి మార్పు లేదని బీజింగ్ పిల్లల ఆస్పత్రి డైరెక్టర్ ఝావో షన్నియింగ్ తెలిపారు.
మైకోప్లాస్మా నిమోనియా చైనాలో చాలా ఏళ్ల నుంచి ఉనికిలో ఉందని చెప్పారు. దీనికి కచ్చితమైన రోగ నిర్ధారణ లేదని వెల్లడించారు. కానీ, తమకు ఈ చికిత్సలో చాలా అనుభవం ఉందని వివరించారు. ప్రారంభ దశలోనే చికిత్సను అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com