China: మాగ్‌లెవ్ రైలు.. 1000 కిలోమీటర్లు, రెండున్నర గంటలు..

Train Source:CRRC
గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మాగ్‌లెవ్ చైనా లాంచ్ చేసింది. ఈ రైళ్లతో వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునని డ్రాగన్ కంట్రీ పేర్కొంది. ఇదే దూరానికి విమానంలో వెళ్తే సుమారు 3 గంటల సమయం పడుతుందని చైనా అంటోంది. విద్యుదయస్కాంత సాంకేతికతతో దీనిని నడుపుతారు. క్విన్‌డాగోలో ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు. భూమ్మీద ఉండే అన్ని వాహనాల్లోకెల్లా ఈ రైలే వేగంవంతమైనదని చైనా వెల్లడించింది.
2016 అక్టోబర్‌లో ఈ రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. 2020 జూన్‌లో పరీక్షించారు. ఈ రైలులో 2 నుంచి 10 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 100 మంది ప్రయాణించవచ్చు. ఇక దీనికి చక్రాలు ఉండవు. ఇంజన్ కూడా ఉండదు. రైలుకు ఇరువైపులా, కింద ప్రత్యేకంగా తయారు చేసిన అయస్కాంతాలు ఉంటాయి. వీటిల్లో విద్యుత్తు ప్రవహింపజేసినప్పుడు కలిగే ఆకర్షణ, వికర్షణల వల్ల రైలు ముందుకు కదులుతుంది.
సాధారణ రైళ్లకు, మాగ్‌లెవ్ రైళ్లకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. కానీ ఈ మాగ్‌లెవ్ రైళ్లకు పట్టాలున్నా.. పట్టాలపై పరుగులు తీయదు. పట్టాలకు తాకకుండా విద్యుదయస్కాంత శక్తితో గాల్లో కొంత ఎత్తులో రైలు నడుస్తుంది. చైనా గత రెండు దశబ్దాలుగా మాగ్‌లెవ్ రైళ్ల టెక్నాలజీను ఉపయోగిస్తుంది. పరిమిత సంఖ్యలో ఈ తరహా రైల్లు చైనాలో నడుస్తున్నాయి. జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా మాగ్‌లెవ్ రైలును అభివృద్ధి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com