భార్యే ముద్దు.. మరో మహిళ వద్దు

ఒక వ్యక్తి ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలంటే అతనికి శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి కుటుంబం కూడా అందుకు ఎంతగానో సహకరించాలి. కానీ కొంతమంది తన జీవిత భాగస్వామితో బంధం సరిగ్గా లేదు అన్న నేపంతో ఇతర వ్యామోహాలలో పడిపోతారు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధపడింది ఓ చైనా కంపెనీ. తన ఉద్యోగులెవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిస్తే వాళ్లను ఉద్యోగం నుంచి పీకేస్తామని హెచ్చరించింది.
ఉద్యోగులలో ఉత్పాదకతను పెంచడానికి, వారి సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి పొందించేందుకు కంపెనీలు కొత్త కొత్త నియమాలు, నిర్ణయాలు తీసుకుంటాయి. అవి కొన్నిసార్లు వింతగా కూడా అనిపిస్తాయి. అయితే చైనాలోని జీజియాంగ్‌లో ఉన్న ఓ కంపెనీ తన ఉద్యోగులెవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిస్తే వాళ్లను ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించింది. అక్రమ సంబంధాలవల్ల భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి ఉద్యోగులు పని సరిగా చేయలేరు అనే ఉద్దేశ్యంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వారిని వెంటనే నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగం నుండి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది. ఉద్యోగులలో నైతికతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
సంస్థలోని ఉద్యోగులందరూ నాలుగు నియమాలను తప్పనిసరిగా పాటించాలని నోటీసునిచ్చింది. అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, వివాహం చేసుకోకుండా మహిళను మైంటైన్ చేయడం, వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం తో పాటు విడాకులకు కూడా నో చెప్పింది. ఉద్యోగులందరూ ఈ నిబంధనలు తూచాతప్పకుండా పాటించి మంచి ఉద్యోగులుగా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు నోటీసులో పేర్కొంది. వీటిని ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఈ నిర్ణయంపై చైనాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై నిబంధనలను రూపొందించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇలాంటి నిబంధనల వల్ల కుటుంబ విలువలు నిలబడతాయనే వాదన కూడా వినిపిస్తోంది. అసలు ఈ నిర్ణయం వెనుక ఒక విషయం ఉంది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ఓ ఆయిల్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కు సంబంధించిన ఒక హై ప్రొఫైల్ సంఘటన అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను ఒక మహిళతో చేతులు పట్టుకుని వీధుల్లో విహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. వీడియోలో కనిపించిన మహిళ అతని భార్య కాకపోవడంతో కంపెనీ అతనిని విధులలోంచి తొలగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com