Arangetram: భరతనాట్య ప్రదర్శనతో రికార్డు సృష్టించిన చైనా బాలిక

Arangetram: భరతనాట్య ప్రదర్శనతో రికార్డు సృష్టించిన  చైనా బాలిక
X
భారత రాయబార కార్యాలయం సిబ్బంది హాజరు

పదమూడేండ్ల చైనా బాలిక తన దేశంలో భరతనాట్యం అరంగేట్ర ప్రదర్శనతో అదరగొట్టింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయలకు ఎంతో గౌరవం ఉంది. మన ఆచార వ్యవహారాలను ఎంతగానో ఇష్టపడతారని ఎన్నోసార్లు తేటతెల్లమయ్యింది. అది తాజాగా బీజింగ్‌లో 13 ఏళ్ల చైనా బాలిక భరత నాట్య ప్రదర్శనతో నిజమని తేలింది. చైనాలో మన సంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యానికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడి చిన్నారులు భరత నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బీజింగ్‌లో చైనా బాలిక లీ ముజి (13) అరంగేట్రం ప్రదర్శన సంచనలనం సృష్టించింది. మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ప్రజాదరణ పొందడం అనేది విశేషం. ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి లీలా శాంసన్‌, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్‌ అభిమానుల సమక్షంలో లీ ముజీ సోలోగా 'అరంగేట్రం' ప్రదర్శన ఇ​చ్చింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన భారత రాయబారి కార్యాలయం ఇన్‌చార్జ్‌ టీఎస్‌ వివేకానంద్‌ మాట్లాడుతూ..చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో సరిగ్గా ప్రదర్శన ఇచ్చిన 'అరంగేట్రం' ఇది అన్నారు.

ఇక్కడ లీ చైనీస్‌ ఉపాధ్యాయులచే చైనాలోనే ఈ భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ప్రదర్శించడం విశేషం. ఇది భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన చైనా భరతనాట్య నర్తకి జిన్ షాన్ షాన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ కూడా హాజరయ్యారు. అంతేగాదు లీ ప్రదర్శనం కోసం చెన్నై నుంచి విమానంలో సంగీత విద్వాంసుల బృందం తరలి వచ్చింది. కాగా, లీ ఈ నెలాఖారున ఆమె చెన్నైలో కూడా ప్రదర్శన ఇవ్వనుంది.

Tags

Next Story