China: దివాలా ప్రకటించిన స్థిరాస్తి దిగ్గజం

China: దివాలా ప్రకటించిన స్థిరాస్తి దిగ్గజం
అప్పుల్లో కూరుకుపోయిన చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్‌గ్రాండే

చైనాలో అంతర్గతంగా ముదిరిపోయిన రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభం బహిర్గతం కానుంది. చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజమైన ఎవర్‌గ్రాండే సంస్థ దివాళా పిటిషన్‌ దాఖలు చేసింది. చైనా జీడీపీలో 30 శాతం వాటా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం డొల్లతనాన్ని ఇది బయటపెడుతోంది. 28 లక్షల కోట్ల రూపాయల అప్పులున్న చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌ గ్రాండే దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. చైనాలో కొన్నేళ్లుగా పెరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభానికి ఇది నిదర్శనంగా నిలిచింది. తమ సంస్థ కోలుకోవడానికి ఇదే మార్గమని ఎవర్‌గ్రాండే చెబుతోంది. రెండేళ్లుగా చైనా ప్రభుత్వం ఎంత యత్నించినా.. దేశ రెండో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థను దివాలా నుంచి కాపాడలేకపోయింది.

ఎవర్‌గ్రాండే దివాలా పత్రాలను న్యూయార్క్‌లో రెగ్యులేటరీ వద్ద దాఖలు చేసింది. దివాలా కేసు మరో దేశంతో సంబంధం ఉన్నప్పుడు అమెరికా కోర్టులు సమన్వయం చేసుకొనేలా చాప్టర్‌-15 కింద దివాలా పిటిషన్‌ను ఫైల్‌ చేసింది. ఇది అమెరికా రుణదాతలు బయట దేశాల్లోని కోర్టులతో సమన్వయం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది.


ఎవర్‌గ్రాండే అప్పులు 340 బిలియన్‌ డాలర్లని అంచనా. చైనా GDPలో ఇది రెండున్నర శాతం. చైనాలో 280 నగరాల్లో 1300 భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పటికే డబ్బు చెల్లించిన 15 లక్షల మందికి ఇళ్లను ఇది నిర్మించి ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, హెల్త్‌కేర్‌, థీమ్‌పార్క్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. 2021లో ఎవర్‌గ్రాండే రుణాలు చెల్లించలేకపోయింది. ఈ ఏడాది జులైలో కూడా 6 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6 కోట్ల ఇళ్ల ధరలు తగ్గే ప్రమాదం ఉంది.

వచ్చే మూడేళ్లలో కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావాలంటే ఎవర్‌గ్రాండేకు 43 బిలియన్‌ డాలర్ల రుణం అత్యవసరం. ఈ నిధులు అందకపోతే ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను మూసివేయాల్సి రావచ్చు. దీనికంతటికీ చైనా ప్రభుత్వ దుందుడుకు వైఖరే కారణం. ప్రభుత్వం స్థిరాస్తి రంగం రుణ సమీకరణపై ఒక్కసారిగా కఠిన నిబంధనలు విధించింది. దీంతో ఎవర్‌గ్రాండే వంటి దిగ్గజ సంస్థలకు నగదు లభించడం కష్టంగా మారిపోయింది. కాసియా, ఫాంటాసియా, షిమావో సంస్థలు దివాలా ప్రకటించాయి. ఇటీవల కంట్రీ గ్రాండ్‌ కూడా విదేశీ బాండ్ల టోకెన్‌ మొత్తాలు చెల్లించలేకపోయింది.

Tags

Next Story