Immersion Therapy: నీటి అడుగున ఎక్సర్సైస్

శరీరంలో అత్యంత ముఖ్యమైన,సున్నితమైన భాగాలైన మెదడు, వెన్నెముకకు గాయాలైతే కోలుకోవడం చాలాకష్టం. ఎన్నో ఆపరేషన్లు, మందులు వాడినప్పటికీ కొందరిలో ఎలాంటి ఫలితాలు కనిపించవు. ఇలాంటి వారికి ఇమ్మెర్షన్ థెరపీ అనే కొత్త విధానంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నీటి అడుగున కసరత్తులు చేసే విధానాన్నే ఇమ్మెర్షన్ థెరపీ అంటారు. వినడానికి వింతగా ఉన్నా మెదడు, వెన్నుముక సమస్యల నుంచి కోలుకోవడానికి ఇదో చక్కటి పరిష్కారంగా ఆస్ట్రేలియా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు పరిశోధకులు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఇమ్మెర్షన్ థెరపీ బాగా పనిచేస్తుందని చెప్పేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎలా ప్రభావం చూపుతుందో శాస్త్రీయంగా వివరించేందుకు నూతన పరిశోధన చేస్తున్నారు.నీటి అడుగుకు వెళ్లినప్పుడు మనుషుల మెదడు,ఇతర శరీర భాగాల మధ్య అనుసంధానం పూర్తి భిన్నంగాఉంటుందని ప్రధాన పరిశోధకులు కేడ్ డేవిసన్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇమ్మెర్షన్ థెరపీ పూర్తిగా పనిచేస్తుందని చెప్పలేమంటున్నారు. కొంత రిస్క్ కూడా ఉంటుందని.. అంచనా వేస్తున్నారు. చాలా మంది రోగులకు ఇమ్మెర్షన్ థెరపీ పనిచేసిందని ఆస్ట్రేలియన్ ఫిజియోథెరపీ అసోషియేషన్‌లో సభ్యురాలైన లిల్లీ కోచెన్ చెప్పారు. అయితే.. ఇందుకోసం తలను నీటిలో ముంచాల్సిన అవసరంలేదని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఆడిలైడ్‌కు చెందిన డిటెర్‌మైన్డ్2 అనే సంస్థ ఇమ్మెర్షన్ థెరపీని అందిస్తుంది. పూల్ థెరపీ, స్కూబా ఇంజరీ థెరపీ, స్కూబా ఫన్ పేర్లతోనూ..ఆ సంస్థ వివిధ చికిత్సలను అందిస్తోంది. ఎలాంటి చిన్న ఘటనా లేకుండా రోగులకు ఇప్పటివరకూ పదివేలకుపైగా సెషన్లు ఇమ్మెర్షన్ థెరపీ నిర్వహించామని డిటెర్‌మైన్డ్2 సంస్థ తెలిపింది. నీటిలో మునిగి చేసే చికిత్స విధానం శస్త్రచికిత్సల నుంచి కోలుకునే దశలోనే తెలిసి ఉంటే ఇప్పుడు ఎంతో బాగుండేవాడినని జేమిసన్ చెబుతున్నారు. ఇమ్మెర్షన్ థెరపీ సాంకేతికత ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో బాగా విస్తరించింది. అయితే ఇమ్మెర్షన్ థెరపీ ఇంకా క్లినికల్ ట్రయల్స్ విధానంలో ఉంది. ఈ పరిశోధనా ఫలితాలు రావాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com