Cocaine: బ్రెజిల్ షార్క్ చేపల్లో కొకైన్

మాదకద్రవ్యాలు మనకే కాదు.. మూగజీవాలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. బ్రెజిల్‌లోని రియో డీ జనీరో సరిహద్దు నీటి వనరుల్లోని షార్క్ చేపల్లో కొకైన్ గుర్తించటం సంచలనం రేపింది. దీని ప్రభావంతో వాటి వ్యవహారశైలిలో మార్పులు వస్తున్నాయని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి కండరాల్లో సాధారణ మోతాదు కన్నా 100 రెట్లు అధికంగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు.
బ్రెజిల్ సముద్ర తీరంలోని కొన్నిరకాల చేపల్లో భారీఎత్తున మాదకద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్లోరిడా, దక్షిణ.. మధ్య అమెరికా తీరాలకు స్మగ్లర్లు సముద్రమార్గం ద్వారా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తుంటారు. దాడులు జరిగినపుడు వీరు టన్నులకొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలోకి జారవిడుస్తుండటంతో చేపలు ఆ ప్రభావానికి గురై ఉంటాయని భావిస్తున్నారు. బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. మాదకద్రవ్యాల కారణంగా సముద్రం కలుషితమైతే.. అది షార్క్ చేపలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు 13 వైల్డ్ బ్రెజీలియన్ షార్ప్‌నోస్ షార్క్‌లను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు. వాటి కండరాలు, కాలేయంపై లిక్విడ్ క్రొమోటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షల్లో 13 చేపల్లోనూ కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. అది కూడా గతంలో ఇతర ఆక్వాటిక్ సెంటర్లలో పరీక్షించిన దానికంటే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మాదకద్రవ్యాల కారణంగా చేపల ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది.
అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ల్యాబ్‌ల నుంచి నీటిని నీటి వనరుల్లోకి వదలటం వల్ల, ఆ నీటిని తాగటంతో షార్క్‌ల శరీరంలో కొకైన్ చేరుతున్నదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే షార్క్‌లలో కొకైన్ స్థాయిలు అత్యధికంగా ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వాటి కంటి చూపు మందగించి, వేటాడే శక్తిని కోల్పోతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com