Russia: వ్యాక్సినేషన్ రేటులో రష్యా వెనుకబాటు.. కరోనా కట్టడికి ఇంక దారి లేదా..?

Russia corona (tv5news.in)
Russia: రష్యాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలతో రష్యా వణికిపోతోంది. తాజాగా మరో 36వేల మంది వైరస్ బారినపడ్డారు. 11 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదుకావడం ఇదే ప్రథమం.
కరోనా వ్యాప్తి కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈనెల 30 నుంచి నవంబర్ ఏడు వరకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మ్యూజియంలు, థియేటర్లు, కన్సర్ట్ హాల్స్ వంటి ప్రదేశాలకు టీకా తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కరోనా కట్టడికి సెలవులు ప్రకటిస్తే.. ప్రజలు విహార యాత్రలు చేస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎక్కువమందికి టీకాలు తీసుకోకపోవడమే తాజా వైరస్ ఉద్ధృతికి కారణమంటున్నారు నిపుణులు. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్లు మాత్రమే పూర్తిగా టీకా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట టీకాను ఆవిష్కరించిన రష్యాలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.3లక్షల మంది చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com