పలు దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా సెకండ్ వేవ్

కరోనా వైరస్ ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే పలు దేశాల్లో ఇప్పుడు కరోనా రెండవ దశ ప్రతాపం చూపిస్తోంది. రోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక యూరప్, అమెరికా దేశాల్లో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. మొదటి సారి కంటే సెకండ్ వేవ్‌లో అత్యంత భయంకరంగా వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా.... యూరప్ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్‌డౌన్ ప్రకటించారు.
ఇక పోర్చుగల్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో కర్ఫ్యూని అమలు చేశారు. ఐర్లాండ్ వారం రోజుల క్రితమే అత్యవసరాలు మినహా మార్కెట్లని మూసేసింది. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌పై కూడా దేశంలో లాక్‌డౌన్ విధించాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు వివిధ దేశాల్లో లాక్‌డౌన్ పట్ల వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ భారత్‌లోనూ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్య అందుకు సంకేతమేనా..? అంటే ఆరోగ్య నిపుణుల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. కర్ణాటక, గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో వరుసగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అయితే క్రియాశీలక కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో రోజువారీ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు... 5 వందలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 82 వేలు దాటగా.... లక్షా 21 వేల మందికి పైగా మరణించారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91 శాతంగానూ.. యాక్టివ్ కేసుల శాతం 7.16 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com