కరోనా వ్యాక్సిన్‌లు వస్తున్న నేపథ్యంలో WHO గుడ్ న్యూస్

కరోనా వైరస్ వ్యాప్తి, దాని తీవ్రతపై ఇన్నాళ్లూ హెచ్చరిస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తీపికబురు చెప్పింది. ప్రపంచం ఇక మహమ్మారి విపత్కాలం ముగింపుపై కలలు కనే సమయం ఆసన్నమైందని WHO తెలిపింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ల సానుకూల ఫలితాల నేపథ్యంలోనే సంస్థ ఈ ప్రకటన చేసింది. వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం అప్రమత్తత, జాగ్రత్తతో ఉండాలంటూ హెచ్చరిస్తూ వచ్చిన WHO .. సుదీర్ఘకాలం తర్వాత సానుకూల ప్రకటన చేసింది. ఎన్ని ఔషధాలు, వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొన్నా.. WHO మాత్రం కరోనా ఇంకా సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన యావత్తు ప్రపంచానికి ఊరటనిచ్చే అంశం.
వ్యాక్సిన్ విషయంలో పేద, మధ్య ఆదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించరాదని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. కరోనా అంతానికి సమయం దగ్గరపడ్డప్పటికీ.. ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా ఉందన్నారు. పరోక్షంగా పేద దేశాలకు టీకా అందుబాటులోకి రావడంపై ఉన్న సందేహాలను వ్యక్తం చేశారు. కరోనా టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచితో పాటు చెడునూ వెలుగులోకి తెచ్చిందన్నారు. ఈ కష్టకాలంలో ప్రజల నిబద్ధత, త్యాగం, శాస్త్ర విజ్ఞాన శక్తి, మనసులను కదలించిన సంఘీభావాలు అందరికీ స్ఫూర్తిగా నిలిస్తే.. స్వార్థం, విభజన, పరస్పర నిందారోపణలు కలచివేశాయన్నారు. మహమ్మారి UNO జనరల్ అసెంబ్లీ నిర్వహించిన తొలి ఉన్నతస్థాయి సమావేశంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పుల వంటి శాశ్వత సమస్యలకు ఎలాంటి వ్యాక్సిన్ పరిష్కారం చూపలేదని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. మహమ్మారి కాలం ముగియగానే ప్రతిదేశం ఈ సవాళ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఉత్పత్తి, వినియోగంలో ఇప్పటి వరకు కొనసాగిన ఏకచ్ఛత్రాధిపత్యం, ప్రకృతి సమతుల్యతను కాపాడడంపై నిర్లక్ష్య వైఖరి, బెదిరింపులు, అనవసరపు జోక్యాలు, విభజన రాజకీయాలవైపు తిరిగి అడుగులు వేయరాదన్నారు.
వ్యాక్సిన్‌ను ప్రైవేటు వినియోగ వస్తువుగా చూడరాదని.. అందరికీ అందుబాటులోకి వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. టీకా పంపిణీ కోసం WHO ఏసీటీ-ఆక్సిలరేటర్ కార్యక్రమానికి మరికొన్ని నిధులు అవసరమన్నారు. లేదంటే ఓ ఉన్నత లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదం ఉందన్నారు టెడ్రోస్. తక్షణం 4.3 బిలియన్ డాలర్లు అవసరం ఉండగా.. 2021లో మరో 23.9 బిలియన్ డాలర్లు అవసరమవుతాయన్నారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత జీ20 దేశాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో ఈ మొత్తం కేవలం 0.005 శాతమేనన్నారు. అందుకోసం... కరోనా నివారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సభ్య ధనిక దేశాలు సహకరించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com