ప్రపంచవ్యాప్తంగా వైరస్ విలయతాండవం.. రెండున్నర కోట్లు దాటేశాయి..

ప్రపంచవ్యాప్తంగా వైరస్ విలయతాండవం.. రెండున్నర కోట్లు దాటేశాయి..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. జాన్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటాయి. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 8 లక్షలా 42వేల 700 మందికిపైగా మరణించారు. దాదాపు 1.64 కోట్ల మంది కోలుకున్నారు. కరోనా వైరస్‌ ప్రధానంగా అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కేసుల సంఖ్యలో ఈ దేశాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. వీటిలో 53 శాతం పైగా కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. అమెరికాలో 59 లక్షలు, బ్రెజిల్‌లో 38 లక్షలు, భారత్‌లో 35 లక్షలకుపైగా నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే బ్రెజిల్‌ను దాటి భారత్‌ రెండో స్థానానికి చేరుకునే ప్రమాదం ఉంది. ఇక అమెరికాలో లక్షా 86వేల కరోనా మరణాలు సంభవించగా.. బ్రెజిల్‌లో లక్షా 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో మూడో స్థానంలో కొనసాగుతోంది.. కేసుల పరంగా మూడో స్థానంలో ఉన్నా.. మరణాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.. పెరూలోనూ అదే తీవ్రత కనబడుతోంది.. పెరోలూ కరోనా మరణాలు 28వేలా 607కు చేరాయి.

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ సోకి నెగెటివ్‌ వచ్చిన వ్యక్తులకు కొద్దిరోజుల తర్వాత మళ్లీ పాజిటివ్‌ సోకే విషయంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. మరోసారి పాజిటివ్‌ రావడానికి వారి శరీరంలోని మృత వైరస్‌లేనని స్పష్టం చేశారు. రెండోసారి పాజిటివ్‌ వచ్చినప్పటికీ వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారి నుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా నూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుందని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్‌ సంఖ్య తగ్గిపోతుందన్నారు. శరీరం నుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రివర్స్‌ ట్రాన్స్క్రిప్షన్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్‌ రావడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

మరోవైపు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు టీకాను అభివృద్ధి చేసే పనిలో తలమునకలవుతున్నాయి. భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న టీకా ఇప్పటికే రెండో దశ క్రినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉంది. అయితే, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను తిరస్కరించాలంటూ ఆస్ట్రేలియాలోని కొందరు మత పెద్దలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. దీనిపై ఆ దేశ ప్రధానికి కూడా లేఖలు రాశారు. దీంతో ఆస్ట్రేలియాలో కరోనా టీకా వ్యతిరేకత పెరుగుతోంది. 1970లో మృతి చెందిన ఓ శిశువు మూలకణాలను ఆక్స్‌ఫర్డ్‌ తన టీకాలో వినియోగించిందని పేర్కొంటూ ఆస్ట్రేలియాకు చెందిన సుఫీయా ఖలీఫా అనే ఇమామ్‌ ఓ వీడియోలో పేర్కొన్నారు. ముస్లిం మత ఆచారం ప్రకారం ఇది హరామ్‌ అని, కాబట్టి టీకాను తీసుకోవద్దని పిలుపునిచ్చారు. అంతకు ముందే.. క్రైస్తవుల మత పెద్ద ఆర్చ్‌బిషప్‌ ఆంథోనీ ఫిషర్‌ కూడా టీకాను వ్యతిరేకించారు. టీకా అభివృద్ధిలో శిశువు మృతకణాలు వినియోగించారని, ఇది క్రైస్తవులకు నైతికపరమైన సమస్యను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఆర్చ్‌బిషప్‌కు మద్దతు తెలుపుతూ ఆంగ్లికన్‌, గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ మత పెద్దలు కూడా లేఖపై సంతకాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story