Covid-19: కరోనాతో వణికిపోతున్న అమెరికా..కొత్త వేరియంట్ వ్యాప్తి!

Covid-19: కరోనాతో వణికిపోతున్న అమెరికా..కొత్త వేరియంట్ వ్యాప్తి!
X
చైనా, హాంగ్‌కాంగ్‌లలో ఆసుపత్రి చేరికలు పెంచిన ఈ వేరియంట్

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. NB.1.8.1గా గుర్తించిన ఈ వేరియంట్ చైనాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ తో ఆసుపత్రులలో చేరుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో కూడా వ్యాపిస్తున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. న్యూయార్క్ నగరంతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి చివరి నుంచి ఏప్రిల్ ఆరంభం మధ్యకాలంలో కాలిఫోర్నియా, వాషింగ్టన్ స్టేట్, వర్జీనియా, న్యూయార్క్ విమానాశ్రయాలకు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులలో NB.1.8.1 వేరియంట్‌ను తొలిసారిగా గుర్తించారు. ఆ తర్వాత ఒహాయో, రోడ్ ఐలాండ్, హవాయి రాష్ట్రాల్లోనూ మరిన్ని కేసులు బయటపడ్డాయి.

అమెరికాలో ప్రస్తుతానికి ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, చైనా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంగ్‌కాంగ్‌లో గత నెల రోజులుగా కరోనాతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య, అత్యవసర చికిత్సల సంఖ్య పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కేవలం నాలుగు వారాల్లోనే హాంగ్‌కాంగ్‌లో ఈ వేరియంట్ కారణంగా 81 తీవ్రమైన కేసులు, 30 మరణాలు నమోదయ్యాయని, వీరిలో ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడినవారేనని తెలుస్తోంది. చైనాలో కూడా ఇటీవలి వారాల్లో కరోనాతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య రెట్టింపు అయింది.

అయితే, చైనా అధికారులు మాత్రం ఈ వేరియంట్ తీవ్రతను తక్కువ చేసి చూపుతున్నారు. ఇది పాత వేరియంట్ల కంటే ప్రమాదకరమైనది కాదంటున్నారు. అమెరికా ఆరోగ్య నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అమీ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. NB.1.8.1 వేరియంట్ వల్ల తీవ్ర అనారోగ్యం కలగకపోయినా, ఇది పాత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. "చైనా, హాంగ్‌కాంగ్ సహా మరికొన్ని దేశాలలో ఈ వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది" అని ఆమె పేర్కొన్నారు. సీడీసీ విమానాశ్రయ నిఘాలో ఈ కొత్త వేరియంట్ కలిగిన ప్రయాణికులు చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, వియత్నాం, తైవాన్ వంటి అనేక దేశాల నుంచి వచ్చినట్లు తేలింది. దీనివల్ల ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కూడా పాతవాటి మాదిరిగానే దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, అలసట వంటివి ఉంటున్నాయి. అయితే, నెవాడా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుభాష్ వర్మ వంటి నిపుణులు NB.1.8.1 వేరియంట్‌కు "గ్రోత్ అడ్వాంటేజ్" (వేగంగా వృద్ధి చెందే లక్షణం) ఉందని, అందుకే ఇది ఎక్కువగా వ్యాపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. హాంగ్‌కాంగ్‌లో, సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ అధిపతి డాక్టర్ ఎడ్విన్ సుయ్ మాట్లాడుతూ, ఈ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోకూడదని, ఇది ప్రస్తుత టీకా రక్షణను కూడా తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉండవచ్చని హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సుల మేరకు అక్కడి అధికారులు దీని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.

ఆరోగ్యవంతులైన పిల్లలు, గర్భిణులకు సాధారణ కోవిడ్-19 టీకాలు ఇకపై సిఫార్సు చేయబోమని, బూస్టర్ డోస్‌లు కేవలం వృద్ధులు వంటి అధిక ప్రమాదం ఉన్నవారికి మాత్రమే పరిమితం చేస్తామని అమెరికా ఆరోగ్య సంస్థలు మార్గదర్శకాలను సవరించిన తరుణంలో ఈ కొత్త వేరియంట్ వెలుగు చూడటం గమనార్హం.

Tags

Next Story