Pakistan : రికార్డు స్థాయికి చేరిన పెట్రో ధరలు..!

Pakistan :  రికార్డు స్థాయికి చేరిన పెట్రో ధరలు..!
పాక్‌లో 333 రూపాయలకు చేరిన పెట్రోల్

సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ పెంపుతో ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న దాయాది దేశంలో పెట్రోల్ డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.330 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ధరల పెరుగుతున్న ట్రెండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఇప్పటికే రెండంకెలకు చేరుకుంది.దీంతో పెట్రోలు ధరలు లీటరుకు పాకిస్థాన్ రూపాయల్లో 26.02, హై-స్పీడ్ డీజిల్ లీటరుకు 17.34 పాక్ రూపాయల చొప్పున పెంచారు. ఈ పెంపు రెండు వారాల్లో రెండవ సారి పెరుగుదల. పాకిస్థాన్‌లో పెట్రోల్ ఇప్పుడు లీటరుకు 333.38 పాక్ రూపాయలకు విక్రయిస్తున్నారు. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 329.18 రూపాయలకు పెరిగింది. ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు తొలిసారిగా 300 బెంచ్ మార్కు స్థాయిని అధిగమించాయి.


చారిత్రక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లకు దారితీసిన ఇటీవలి ఆర్థిక సంస్కరణల కారణంగా ఆ దేశంలో పెట్రోల్, విద్యుత్ ధరలు పెరిగాయి. నవంబర్‌లో జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతతో పాటుగా ఆర్థిక పరిస్థితులు దిగజారాయి.సెప్టెంబర్ 1వ తేదీన పెట్రోల్, డీజిల్‌పై రూ. 14 చొప్పున ఆపద్ధర్మ ప్రభుత్వం పెంచింది. అంతకు ముందు ఆగస్టు 15వ తేదీన హైస్పీడ్ డీజిల్‌పై లీటరుకు రూ.38.49, పెట్రోల్‌పై రూ.32.41 చొప్పున ప్రభుత్వం ధరలు పెంచింది. నెలరోజుల్లోనే పెట్రోల్‌పై రూ.58.43, డీజిల్‌పై 55.83 చొప్పున ఆపద్ధర్మ ప్రభుత్వం పెంచింది.

ఈ పెంపుతో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలు పెట్రోల్ బంకులలో రూ. 330 ఎగువకు చేరుకున్నాయని ది డాన్ వార్తాపత్రిక తెలిపింది. దేశ చరిత్రలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారని పత్రిక తెలిపింది. ఇప్పటికే నిత్యావరస వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జీవనం దుర్భరమైపోయిన సమామాన్య ప్రజలకు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పిడుగుపాటుకు మారింది.

Tags

Read MoreRead Less
Next Story