Cyclone Senyar : మలేషియా పరిసర ప్రాంతాల్లో తుపాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం..

మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. బుధవారం ఉదయం తుపాన్‌గా మారిన ఈ తీవ్ర వాయుగుండం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాన్‌కు సెన్యార్‌గా నామకరణం చేసినట్లు పేర్కొంది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ‘సెన్యార్’ అని పేరు పెట్టినట్టు వెల్లడించింది.
కాగా ఈ తుపాన్ 24 గంటల తర్వాత క్రమంగా బలహీన పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ దిశగా కదులుతున్న తుపాన్ ఇవాళ మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది. ఈ తుపాన్ భారత్‌పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 12 గంటల్లో ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది.
దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

