'డెల్టా' ప్రమాద ఘంటికలు..అక్కడ మళ్లీ లాక్ డౌన్

డెల్టా ప్రమాద ఘంటికలు..అక్కడ మళ్లీ లాక్ డౌన్
Delta Variant: తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తోంది డెల్టా వేరియంట్. పలు దేశాల్లో వైరస్ విజృంభించడంతో పలు దేశాలు ముందస్తు లాక్ డౌన్ ప్రకటించాయి.

Delta Variant: తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తోంది డెల్టా వేరియంట్. పలు దేశాల్లో వైరస్ విజృంభించడంతో మరోసారి ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికి, కేసులు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టడంలేదు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా.. పలు దేశాలు ముందస్తు లాక్ డౌన్ ప్రకటించాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని సంతోష పడుతున్న సమయంలో వైరస్ వ్యాప్తి మరోసారితమ పంజా విసురుతుంది. డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కొద్దిరోజులుగా ఒకటిన్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. జపాన్‌లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకూ లాక్‌డౌన్ పొడిగించారు.

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్‌ సోకింది. దాదాపు 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్‌ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంది. డెల్టా వేరియంట్లతో వైరస్‌ల బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది.

ఇక జపాన్‌లోనూ కొవిడ్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సగటున రోజుకు 20వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ కట్టడి కోసం జపాన్‌ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది. సెప్టెంబర్‌ 12 వరకూ అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని.. షాపింగ్‌ మాళ్లలో ప్రజలు గుమికూడకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు 600లకు పైగా కేసులు వచ్చాయి. వైరస్‌ ఉద్ధృతితో సిడ్నీలో లాక్‌డౌన్‌ పొడిగించారు. సెప్టెంబర్‌ చివరివరకు ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

దేశంలో థర్డ్‌ వేవ్‌ రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.23వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌లో ఇతరులతో పోలిస్తే చిన్నారులు ఎక్కువ ప్రభావానికి గురవుతారని వస్తోన్న వార్తల నేపథ్యంలో పిల్లల సంరక్షణ విభాగాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు.

జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తోన్న అనురాగ్‌ ఠాకుర్‌, దేశంలో ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా భారీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 57 కోట్ల కొవిడ్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 44కోట్ల మందికి మొదటి డోసు అందించగా.. 12కోట్ల 77లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story