Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ పుతిన్‌ సేనలు

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ పుతిన్‌ సేనలు
క్షిపణుల వర్షాలు, డ్రోన్లతో దాడులు

22 నెలల యుద్ధంలో రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి తర్వాత..ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం నుంచి ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. రష్యా నగరంపై దాడి చేసిన ఏ ఒక్కరినీ శిక్షించకుండా వదిలిపెట్టబోమని పుతిన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

ఉక్రెయిన్‌లోని రెండు అతిపెద్ద నగరాలే లక్ష్యంగా రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. రష్యా దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అనేక మందికి గాయాలయ్యాయి. ఖార్కివ్‌ నగరంలో రష్యా క్షిపణి దాడులకు 41 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఐదు ప్రాంతాలపై రష్యా బాంబులు కురిపించింది. అక్కడ కనీసం 12 మంది గాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం సరిహద్దుల్లో ఉన్న రష్యా నగరం బెల్గోరోడ్‌పై ఉక్రెయిన్‌ సైన్యం దాడి చేయడం రష్యాను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. 22 నెలల యుద్ధంలో రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడిగా దీన్ని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా భారీ దాడులతో రష్యా విరుచుకుపడింది. బెల్గోరోడ్‌ నగరంపై దాడి జరిగిన మరుసటి రోజే ఎన్నడూ లేనంతగా శుక్రవారం క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. రష్యా దాడుల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తోంది.


తమ పౌరులపై దాడికి దిగిన ఏ ఒక్కరినీ శిక్షించకుండా విడిచిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. బెల్గోరోడ్‌పై దాడిని ఉగ్రవాదుల చర్యగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌ను అడ్డంపెట్టుకుని పశ్చిమదేశాలు తమపై దాడికి దిగుతున్నాయని పుతిన్‌ ఆరోపించారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌లోని మిలటరీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే తాము దాడులకు దిగుతున్నట్లు తెలిపారు. ఐతే ఉక్రెయిన్‌ మాత్రం రష్యా మాటలకు చేతలకు పొంతన లేదంటోంది. నివాస ప్రాంతాలు, అపార్టుమెంట్లు, షాపింగ్‌ సెంటర్లపై కూడా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది

Tags

Read MoreRead Less
Next Story