Netanyahu : హమాస్‌తో ఒప్పందం వేళ ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

గాజాపై చేస్తున్న యుద్ధంలో త్వరలోనే తమ దేశం విజయం సాధిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అన్నారు. హమాస్ వద్ద ఉన్న తమ పౌరులు విడుదలై తిరిగి తమ దేశానికి చేరుకుంటారని చెప్పారు. సులభమైనా, కఠినమైనా హమాస్‌ను నిరాయుధీకరించడానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు నెతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా యుద్ధం ముగింపు దిశగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ సందర్భంగా హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం గురించి నెతన్యాహు ప్రస్తావించారు. ట్రంప్ ప్రణాళికలోని తొలి దశ అమలు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని తెలిపారు. అదే విధంగా రెండో దశలో దౌత్యపరంగా లేదా సైనిక శక్తితో హమాస్‌ను నిరాయుధీకరిస్తామని పేర్కొన్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకోదని తెలిపారు. మరోవైపు ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయడాన్ని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించరని పేర్కొన్నారు. సోమవారం ఈజిప్టులో ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో తమ వద్ద ఉన్న వారిని కూడా త్వరలో విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అయితే ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. మొదట ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అంగీకరించగా, అధ్యయనం చేశాక చెబుతామని హమాస్ తెలిపింది. తాజాగా హమాస్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. బందీల విడుదల, గాజా పాలనను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమేనని పేర్కొంది. అయితే మరికొన్నింటిపై చర్చలు జరపాలని కోరింది. దీన్ని ట్రంప్ కూడా స్వాగతించారు. ఈ క్రమంలోనే గాజాపై బాంబు దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్‌కు సూచించారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ శనివారం మళ్లీ గాజాపై దాడులకు పాల్పడింది. తాజాగా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతాన్యహుతో కలిసి 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒప్పందం కుదిరిన 72 గంటల్లో బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి. అదే విధంగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. అలాగే 1,700 మంది సాధారణ పౌరులనూ వదిలిపెట్టాలి. గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. దాని ఆయుధ వ్యవస్థలను, సొరంగాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ట్రంప్ సూచించిన ప్రతిపాదనలపై సర్వత్రా ఆమోదం లభించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా గాజా ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకోవాలని హమాస్‌కు ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించాలన్న తన ప్రణాళికను అంగీకరిస్తూ సంతకం చేయకపోతే హమాస్‌కు నరకం చూపిస్తానంటూ సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com