Russia: రష్యాలో భారత కార్మికులకు డిమాండ్!

నిర్మాణం, వస్త్ర పరిశ్రమ సహా కీలక రంగాల్లో రష్యా కంపెనీలు భారతీయ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఆసక్తిచూపుతున్నాయి. సంప్రదాయ రంగాలతోపాటు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక విభాగాల్లో భారతీయ కార్మికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ స్వయంగా వెల్లడించారు.
భారత్ నుంచి ప్రతీ సంవత్సరం లక్షల మంది విదేశాలకు బతుకుదెరువు కోసం వెళ్తూ ఉంటారు. విదేశాల్లో పనిచేస్తే.. అధిక వేతనాలు వస్తాయనే ఆశతో వెళ్తారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. ఇక అమెరికా, బ్రిటన్ సహా వెస్ట్రన్ దేశాలు ప్రస్తుతం తమ దేశానికి ఉద్యోగ, ఉపాధి కోసం వలస వచ్చే ప్రపంచ దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. రకరకాల కారణాలు, కొత్త కొత్త నిబంధనలతో.. ఆయా దేశాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు.. మన మిత్ర దేశం రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. భారతీయులకు రష్యాలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఉద్యోగాలకు భారతీయ నిపుణులను తీసుకోవడంపై రష్యాకు చెందిన కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం రష్యాలో మానవ వనరుల కొరత ఎక్కువగా ఉందని వినయ్ కుమార్ తెలిపారు. భారత్‌లో నైపుణ్యం కలిగిన కార్మికులు పుష్కలంగా ఉన్నారని పేర్కొన్నారు. రష్యాలోని నిబంధనలు, చట్టాలు, కోటాలకు లోబడి అక్కడి కంపెనీలు భారతీయులను నియమించుకుంటున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ రంగం, టెక్స్‌టైల్స్ రంగాల్లో ఎక్కువగా భారతీయులు పని చేస్తున్నారని.. అయితే ఇప్పుడు యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా భారతీయులకు బాగా డిమాండ్ పెరుగుతోందని వివరించారు.
మరోవైపు.. రష్యాలో భారతీయ కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో రాయబార కార్యకలాపాలు పెరుగుతున్నాయని వినయ్ కుమార్ తెలిపారు. ఆయా దేశాలకు పౌరులు రాకపోకలు సాగించేటపుడు.. పాస్‌పోర్ట్ గడువు పొడిగించుకోవడానికి, పాస్‌పోర్ట్ పోయినపుడు లేదా పిల్లలు పుట్టిన తర్వాత రాయబార కార్యాలయం సేవలు అవసరమం అవుతాయని వెల్లడించారు. మరోవైపు.. భారతదేశ విదేశాంగ విధానంలో రష్యాతో సంబంధాలు కీలకమని.. ఎప్పటినుంచో రష్యా.. భారత్‌కు ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com