డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం!

డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం!
త్వరలో వైట్‌ హైస్‌ను వీడుతున్న అధ్యక్షుడు ట్రంప్‌ను ఈలోగానే పదవి నుంచి దించేయాలని డెమోక్రాటిక్‌ పార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది.

త్వరలో వైట్‌ హైస్‌ను వీడుతున్న అధ్యక్షుడు ట్రంప్‌ను ఈలోగానే పదవి నుంచి దించేయాలని డెమోక్రాటిక్‌ పార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది. రిపబ్లికన్లపై ఒత్తిడి తేవడంతో పాటు, 25వ రాజ్యాంగ సవరణ అస్త్రాన్ని, అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించింది. ముందుగా 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఉపయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది డెమోక్రాటిక్‌ పార్టీ. అయితే దీన్ని రిపబ్లికన్‌ సభ్యులు అడ్డుకున్నారు.

కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌పై దాడి చేయాలని ట్రంప్‌ తన మద్దతుదారులను ఉసిగొల్పారని, అధ్యక్ష పదవికి ఆయన ఎంతమాత్రం యోగ్యుడు కాదంటూ తీర్మానంలో డెమోక్రాట్లు పేర్కొన్నారు. ట్రంప్‌ను పదవిలో కొనసాగిస్తే... జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రతకు ట్రంప్‌ సవాలుగా మారారని, శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేసే ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.

అయితే.. 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించి అంశంలో ఉపాధ్యక్షుడు పెన్స్‌ నుంచి ఎలాంటి సంకేతాలూ రాలేదు. దీంతో వెంటనే డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు ట్రంప్‌నకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డెమోక్రాట్లు జమీ రస్కిన్‌, డేవిడ్‌ సిసిలైన్‌, టెడ్‌ లియూలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 211 మంది మద్దతు తెలిపారు.

పదవీకాలం ముగిసేలోగా ట్రంప్‌ను ఎలాగైనా పదవీచ్యుతుడిని చేయాల్సిందేనని ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో కొద్దిరోజులుగా ఆమె కఠినంగానే వ్యవహరిస్తున్నారు.మొదట ట్రంప్‌ తానంతట తానుగా పదవికి రాజీనామా చేసేలా రిపబ్లికన్‌ సభ్యులపై ఒత్తిడి తేవాలని ఆమె భావించారు. అది కుదరని పక్షంలో 25వ సవరణ అధికారం ద్వారా ట్రంప్‌ను తొలగించేలా ఉపాధ్యక్షుడిని కోరాలని యోచించారు. క్యాబినెట్‌ సభ్యులతో కలిసి ట్రంప్‌ను తొలగించేందుకు పెన్స్‌ నిరాకరించినా... ప్రతినిధుల సభలోనే అభిశంసన ప్రక్రియను మొదలు పెడతామని పేలోసీ తేల్చి చెప్పారు.

ఈ అభిశంసన తీర్మానంపై బుధవారం సభలో ఓటింగ్‌ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నారు. తర్వాత సెనేట్‌లో జరగాల్సిన విచారణకు దీన్ని పంపే అవకాశముంది. అయితే, బైడెన్‌ క్యాబినెట్‌ను ఆమోదించడం వంటి ప్రక్రియల వల్ల అభిశంసన తీర్మానాన్ని స్వీకరించడంలో సెనేట్‌ జాప్యం చేసే పరిస్థితి రావచ్చు. అలా కాకుండా, తీర్మానంపై చర్చను ప్రారంభిస్తే... సెనేట్‌లో ఇతరత్రా కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉండదు. అప్పుడు బైడెన్‌ క్యాబినెట్‌కు ఆమోదముద్ర పడే ప్రక్రియ జాప్యం కావచ్చు. రాజ్యాంగ నియమం ప్రకారం ఈ నెల 20న బైడెన్‌ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story