Word of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ’67 అసలు ఎలా ఎంపికైందంటే

ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్ ‘డిక్షనరీ.కామ్’ ‘67’ను 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ (Word of the Year for 2025)గా ప్రకటించింది. ఈ నంబర్ ఇప్పుడిప్పుడే టీనేజ్‌లోకి అడుగుపెట్టినవారు, జెన్‌ఆల్ఫా నోట్లో తెగనానుతోంది. కానీ 30 ఏళ్లు పైబడినవారంతా అసలు దీనర్థం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. దీనిని నిఘంటువులో చేర్చడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నెట్‌లో పేల్చే జోకులు ఇంగ్లీష్ భాషను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
67.. దీనిని కలిపి కాకుండా సిక్స్‌సెవెన్ అని చదవాలి. జెన్‌ఆల్ఫా (2010-2025 మధ్య జన్మించినవారు) ఈ పదాన్ని విపరీతంగా వాడుతున్నప్పటికీ దాని అర్థంపై మాత్రం స్పష్టత లేదు (Gen Alpha). ‘‘ఏదో ఊరికే అలా వాడేపదం. దీనికి అర్థమేమి లేదు. దీనిని నిర్వచించడం అసాధ్యం’’ అని డిక్షనరీ.కామ్ వెల్లడించింది. ఇది రెండు చేతులతో చేసే సంజ్ఞ అని పేర్కొంది. అమెరికా ర్యాపర్ స్క్రిల్లా పాడిన డ్రిల్ సాంగ్ “Doot Doot (6 7)” నుంచి ఈ పదం ఉద్భవించిందని భావిస్తున్నట్లు తెలిపింది. ఆ పాటమొత్తం ‘67’ హుక్ వర్డ్‌గా వినిపిస్తూనే ఉంటుంది.
అప్పటినుంచి ఈ పదాన్ని జెన్ఆల్ఫా తన రోజూవారీ జీవితంలో భాగం చేసుకుంది. తమ విద్యార్థులు ఈ పదాన్ని వాడకుండా ఎలా ఆపాలంటూ టీచర్లు నెట్టింట్లో పోస్టులు పెట్టారు. పలువురు దానికి టిప్స్ చెప్పారు. ఇలా ఆన్‌లైన్ సంభాషణలో ఈ వర్డ్ భాగమైంది. దాంతో ఇది విపరీతంగా వైరల్ అయింది. దీంతోపాటు ఆరాఫార్మింగ్, బ్రోలిగార్కీ, ట్రాడ్‌వైఫ్, టారిఫ్, ఓవర్‌టూరిజం వంటి పదాలు కూడా షార్ట్ లిస్ట్ అయినా 67 ముందు నిలవలేకపోయాయి. దాంతో ఈ నంబర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా నిఘంటువులో స్థానం దక్కించుకుంది. ఇక పదాలు నిండుకున్నాయని, వచ్చే ఏడాది ఎమోజీ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలుస్తుందేమోనని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

