Donald Trump : కమలా హారిస్‌తో డిబేట్‌కు ఓకే చెప్పిన ట్రంప్

Donald Trump : కమలా హారిస్‌తో డిబేట్‌కు ఓకే చెప్పిన ట్రంప్
డేట్‌ ఫిక్స్‌ చేసిన మాజీ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున కమలా హారిస్‌ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆమెతో ముఖాముఖి చర్చ జరిపేందుకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఫాక్స్‌న్యూస్‌ ఆఫర్‌ను ఆయన అంగీకరించారు. ఈవిషయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ఖాతాలో తాజాగా వెల్లడించారు. వచ్చే నెలలో వీరి మధ్య డిబేట్‌ జరగనుంది.

‘‘సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే ఈవెంట్‌లో కమలా హారిస్‌ తో డిబేట్‌ జరిపేందుకు అంగీకరించా. వాస్తవానికి ఇదే తేదీన ఏబీసీ ఛానల్‌లో జో బైడెన్‌తో నేను ముఖాముఖి చర్చలో పాల్గొనాల్సింది. అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలగడంతో ఆ డిబేట్‌ రద్దయ్యింది. ఫాక్స్‌న్యూస్‌ డిబేట్‌ పెన్సిల్వేనియాలో జరుగుతుంది. బైడెన్‌తో జరిగిన చర్చలోని రూల్స్‌ అన్నీ దీనికి వర్తిస్తాయి. కానీ ఈసారి పూర్తిస్థాయిలో ప్రేక్షకులు కూడా ఉంటారు’’ అని ట్రంప్‌ వెల్లడించారు.

అయితే.. ఈ డిబేట్‌, దాని కండీషన్స్‌కు హారిస్‌ అంగీకరించారా? లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ట్రంప్‌తో చర్చ గురించి ఆమె ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. అయితే, ఆయనతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని గతంలో కమలా హారిస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో ట్రంప్‌ దానిపై స్పందించలేదు. తాజాగా హారిస్‌ పోటీ ఖాయమవడంతో డిబేట్‌కు అంగీకరిస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

కమలా హారిస్‌, ట్రంప్‌మధ్య ముఖాముఖి చర్చ జరిగితే.. అది ఈ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగనున్న రెండో డిబేట్‌ కానుంది. జూన్‌లో బైడెన్‌, ట్రంప్‌ మధ్య తొలి డిబేట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఆ చర్చకు ప్రేక్షకులను అనుమతించలేదు. ఆ డిబేట్‌ తర్వాతే బైడెన్‌ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రమైంది. దీంతో అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలిగి కమలా హారిస్‌ పేరును ప్రతిపాదించారు.

Tags

Next Story