Donald Trump: దోషిగా తేలిన ట్రంప్.. ఏ కేసులోనంటే
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో.. ట్రంప్ దోషిగా తేలిపోయారు. ఈ మేరకు.. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్ కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే, ఇంకో 5 నెలల్లో జరగనున్న 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్న ట్రంప్ కు.. తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సంబంధిత కేసు కోసం మాన్హాటన్లోని కోర్టుకు మాజీ అధ్యక్షుడు వెళ్లాడు. జడ్జి మాటలు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, కోర్టు బయటకు వచ్చి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన మీద చేస్తున్న కుట్ర అని ఆరోపణలు చేశారు. కోర్టులో కూడా రిగ్గింగ్ జరిగింది.. కానీ నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రజలే నిజమైన తీర్పును ఇస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని పేర్కొన్నారు. అందుకోసం బిజినెస్ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం అవన్నీ నిజమేనని తాజాగా కోర్టు తేల్చింది. ట్రంప్‌తో అక్రమ సంబంధం వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జులై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యూయమూర్తిదే. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయ నిపుణులు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంతకంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటుండడం గమనార్హం. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com