Donald Trump: డొనాల్డ్ ట్రంప్ దోషే, 34 కేసుల్లో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు
అమెరికా అధ్యక్ష పగ్గాలు రెండోసారి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి దెబ్బ తగిలింది. హష్ మనీ పేమెంట్స్‌సహా 34 అభియోగాల్లో... న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలేమని న్యాయనిపుణులు అంటున్నారు. తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి షాక్ తగిలింది. హష్ మనీ పేమెంట్స్‌సహా 34 అభియోగాల్లో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది. దీంతో ట్రంప్‌నకు ఎంత శిక్ష పడుతుంది, ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తే ఎన్నికల్లో పోటీకి అడ్డంకి కాదా అనే అంశాలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పలేమని న్యాయనిపుణులు అంటున్నారు. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా...పరిగణిస్తారు. ఈ వ్యవహారంలో పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తికే ఉంటుంది. ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అయితే కచ్చితంగా జైలుశిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. జైలుశిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో...ఆ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకంటే తీవ్రమైన మరో 3 కేసుల్లో ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన తరఫు న్యాయవాదులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధన కూడా లేదన్నారు. 1920లో సోషలిస్ట్ నేత జైలు నుంచే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ట్రంప్ కూడా యథావిధిగా ప్రచారం చేసుకోవచ్చన్నారు. కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత ట్రంప్...అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఆయన తరఫు న్యాయవాదులు ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ కోర్టు తీర్పు అవమానకరమని ట్రంప్ కొట్టిపారేశారు. అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి విచారణ జరిపారని ఆరోపించారు. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నిజమైన తీర్పు ప్రజలు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని, దేశంకోసం, న్యాయంకోసం పోరాడుతూనే ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com