Donald Trump: ట్రంప్‌పై మరో కేసు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరో కేసు నమోదయింది. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియా ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ ప్రయత్నించినట్లు, ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 2024 అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న ట్రంప్‌పై కొత్త అభియోగాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన డాక్యుమెంట్‌లో ట్రంప్‌తో పాటు 18 మందిపై అభియోగాలు మోపారు. మొత్తానికి ఈ ఏడాది ఇలా ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదవ్వటం నాలుగోసారి.
ఎన్నికల్లో ట్రంప్ జోక్యంపై ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ 2021 ఫిబ్రవరిలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ మొత్తం ఆరోపణల్లో ది రాకెటీర్ ఇన్‌ఫ్లూయెన్స్, కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ ఉల్లంఘన అభియోగాలు అత్యంత తీవ్రమైనవి. తప్పుడు వాంగ్మూలాలు, పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ, తప్పుడు సమాచారంతో పత్రాలు పూర్తిచేయడం, సాక్షులను ప్రభావితం చేయడం, దొంగతనం, చట్ట ఉల్లంఘన వంటి నేరాలను మోపారు. మరోవైపు.. ఈ ఆరోపణలపై స్పందించిన ట్రంప్ బృందం.. ప్రాసిక్యూటర్‌ను పక్షపాతిగా అభివర్ణించింది. ఈ ఆరోపణలు చేసినవారు కావాలనే 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ట్రంప్ వరుసపెట్టి కోర్టు కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికే డాక్యుమెంట్లను కావాలనే దాచారంటున్నా వ్యవహారం ఆయనను చికాకు పెడుతుండగా ఇప్పుడు తాజాగా 2020 ఎన్నికల ఫలితాల్లో జార్జియా ఎన్నికల ఫలితాల తారుమారు, రికో ఉల్లంఘనల అభియోగాలు, తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో ట్రంప్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆగస్టు 25నాటికి ఆయన లొంగిపోకపోతే, అరెస్ట్ చేయాలంటూ దీని ఉద్దేశం. ఇదే కేసు విషయమై గడిచిన నాలుగు నెలల్లో ఆయన కోర్టుకు నాలుగుమార్లు హాజరయ్యారు.వైట్‌హౌస్‌లో రెండోసారి అడుగుపెట్టాలనే డొనాల్డ్ ట్రంప్ కలలను ఈ కేసులు దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి
మొదటిసారి అమెరికా మాజీ అధ్యక్షుడు, ట్రంప్ 'పోర్న్ స్టార్'తో అనైతిక ఒప్పందం విషయంలో అభియోగాలు ఎదుర్కొన్నారు, తరువాత రహస్య పత్రాల కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com