Trump Rally Shooting: చివరి నిమిషంలో తల తిప్పడంతో బతికిపోయా

Trump Rally Shooting: చివరి నిమిషంలో తల తిప్పడంతో బతికిపోయా
కాల్పుల ఘటనపై ట్రంప్‌ స్పందన

అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. చివరి నిమిషంలో ఆయన తల కొద్దిగా తిప్పడంతో దుండగుడు కాల్చిన బుల్లెట్‌ కుడి చెవిలో నుంచి పోయిందని, లేకుంటే సూటిగా తలలోకి దూసుకుపోయేదని దాడికి సంబంధించిన వీడియోలు, అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ వేదికపై మాట్లాడుతూ తనకు కుడివైపున ఉన్న ఓ అక్రమ వలసదారుల గణాంకాలకు సంబంధించిన చార్ట్‌ను చూపిస్తూ అటు వైపు తల తిప్పారు. ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్‌ ట్రంప్‌ చెవిని తాకింది. ఒక వేళ ట్రంప్‌ అటువైపు తిరగకుంటే బుల్లెట్‌ నేరుగా తలలోకి దూసుకెళ్లేది.

ఈ విషయాన్ని ట్రంప్‌ కూడా వెల్లడించారు. ‘ఆ చార్ట్‌ తన ప్రాణాలను కాపాడింది’ అని హత్యాయత్నం తర్వాత వైట్‌హౌస్‌ మాజీ ఫిజిషియన్‌ రిప్రజంటేటివ్‌ రాన్నీ జాక్సన్‌కు ఫోన్‌ కాల్‌లో తెలిపారు. తనపై హత్యాయత్నంపై ట్రంప్‌ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకొన్నా. ఇదొక విచిత్రమైన పరిస్థితి’ అని పేర్కొన్నారు. రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో వెళ్తూ ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. ఈ కన్వెన్షన్‌లో ట్రంప్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. జేడీ వాన్స్‌, మార్కో రూబియో, డగ్‌ బర్గమ్‌ ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు.

భద్రతా సిబ్బందికి చెప్పినా..

ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బుల్లెట్‌ను కాల్చడానికి ముందు నిందితుడు ట్రంప్‌ సభా వేదికపై 150 మీటర్ల దూరంలోని ఓ రూఫ్‌పై నక్కి ఉండటంపై సభకు హాజరైన కొంత మంది అధికారులకు తెలిపినా పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. రహస్య పత్రాల తరలింపునకు సంబంధించిన ఆరోపణల కేసును ఫ్లోరిడా కోర్టు కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్‌ తరపు లాయర్‌ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

Tags

Next Story